Naresh Goyal Arrested: కెనరా బ్యాంక్ సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేశారు. ముంబయిలోని ED కార్యాలయంలో సుదీర్ఘ విచారణ తర్వాత గోయల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ప్రత్యేక PMLA కోర్టులో శనివారం నరేష్ గోయల్‌ను హాజరు పరచనున్నారు. ఈ సందర్భంగా ఈడీ ఆయన్ను కస్టడీ రిమాండ్‌కు అనుమతించాలని కోర్టును కోరే అవకాశం ఉంది.
కెనరా బ్యాంక్‌లో ₹538 కోట్ల మోసానికి సంబంధించి జెట్ ఎయిర్‌వేస్, నరేష్ గోయల్, అతని భార్య అనిత, కొంతమంది మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దాని ఆధారంగా గోయల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. జెట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్‌కు రూ.848.86 కోట్ల రుణాలను మంజూరు చేసిందని, అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని బ్యాంక్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. జులై 2021లో జెట్ ఎయిర్వేస్ సంస్థ (JIL) ఖాతాను ఫ్రాడ్‌గా ప్రకటించారని సీబీఐ పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ మొత్తం కమీషన్ ఖర్చులలో రూ. 1,410.41 కోట్లు సంబంధిత కంపెనీలకు చెల్లించిందని, తద్వారా ఆ సంస్థ నిధులను స్వాహా చేసినట్లు బ్యాంకు ఆరోపించింది.
గోయల్ కుటుంబానికి చెందిన సిబ్బంది జీతాలు, ఫోన్ బిల్లులు, వాహన ఖర్చులు వంటి వ్యక్తిగత ఖర్చులను JIL ఖాతాల నుంచి చెల్లించిందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ సమయంలో జెట్ లైట్ (ఇండియా) లిమిటెడ్ ద్వారా అడ్వాన్స్‌లు ఇచ్చి పెట్టుబడులు పెట్టడం ద్వారా నిధులు స్వాహా చేసినట్టు తేలింది. ఈ కేసులో గోయల్‌ను శనివారం ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు.
మే నెలలో గోయల్ ఇళ్లు, కార్యాలయంలో సీబీఐ సోదాలు
మనీ ల్యాండరింగ్ కేసులో మేనెలలో గోయల్ ఇల్లు, కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసగించినందుకు గోయల్, ఆయన భార్య అనిత, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్‌వేస్ నరేష్ గోయల్, ఎయిర్ లైన్స్ మాజీ అధికారులతో సహా ఢిల్లీ, ముంబైలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఒకప్పుడు ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్ తీవ్రమైన నగదు కొరత, అప్పుల భారంతో ఏప్రిల్ 2019లో తన కార్యకలాపాలను నిలిపివేసింది.
దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.