JD Vance Visit to India: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబం భారత్​లో పర్యటించనున్న విషయం తెలిసిందే. సతీమణి ఉషా వాన్స్, తమ పిల్లలతో కలిసి ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ  పర్యటిస్తారు.​ దిల్లీ, జైపుర్‌, ఆగ్రాను సందర్శించనుంది. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జేడీ వాన్స్‌, ఆయన భార్య ఉషా, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌ సోమవారం ఉదయం 10 గంటలకు దిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌లో లాండ్​ కానున్నారు. వారి వెంట విదేశాంగ శాఖకు చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు ఉంటారని తెలుస్తోంది. వీరికి సీనియర్ కేంద్ర మంత్రి, అధికారులు స్వాగతం పలుకనున్నారు. 

వారికి ఆతిథ్యమివ్వనున్న ప్రధాని మోదీ

ఢిల్లీ చేరుకున్న కొన్ని గంటల తర్వాత వాన్స్ కుటుంబం స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. సాంప్రదాయ చేతి వృత్తుల వస్తువులు అమ్మే షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది. వారిది పూర్తిగా ప్రైవేట్ పర్యటనే అయినప్పటికీ.. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ వారికి ఆతిథ్యమివ్వనున్నారు. అనంతరం వాన్స్​తో మోదీ పలు చర్చలు సాగించనున్నారు. భారత్​–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయడంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచే మార్గాలపై చర్చించనున్నారు. 

మోదీ నాయకత్వం వహించే భారత బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని సమాచారం. చర్చల అనంతరం ప్రధానమంత్రి వాన్స్​తో పాటు ఆయన వెంట ఉన్న అమెరికన్ అధికారులకు మోదీ విందు ఇవ్వనున్నారు.

వాన్స్​ కుటుంబం ఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్‌లో బస చేయనున్నారు. సోమవారం రాత్రి జైపూర్‌కు బయల్దేరనున్నారు. ఏప్రిల్ 22న వాన్స్ బృందం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది. వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన అంబర్​కోట కూడా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం  జైపూర్‌లోని రాజస్థాన్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగే సభలో వాన్స్​ ప్రసంగించనున్నట్లు అధికారులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భారతదేశం–అమెరికా సంబంధాలపై వాన్స్ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఏప్రిల్ 23 ఉదయం ఆగ్రాకు వెళ్లే అవకాశం ఉంది. ఆగ్రాలో  వారు తాజ్ మహల్​తోపాటు వివిధ భారతీయ కళాఖండాలను ప్రదర్శించే బహిరంగ ఎంపోరియం అయిన శిల్పగ్రామ్‌ను సందర్శిస్తారు. ఆగ్రా పర్యటనను ముగించిన తర్వాత వాన్స్ కుటుంబం ఏప్రిల్ 23 జైపూర్‌కు తిరిగి వస్తారు. లగ్జరీ హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో వారు బసచేయనున్నారు. 24న జైపూర్ నుంచి అమెరికాకు బయల్దేరుతారు.

వాన్స్​ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఆయన సతీమణి ఉష తెలుగమ్మాయి అనే విషయం తెలిసిందే. 

ఉషాచిలుకూరి వాన్స్‌ది ఆంధ్రానే!ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి.. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి రావడం ఆమెకు ఇదే తొలిసారి.