Soil Crisis across the World | ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు విషపూరిత భారీ లోహాల కారణంగా కలుషితమైన, భూమి ప్రమాదకరంగా మారిన ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని భూమి కోబాల్ట్, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం, రాగి, నికెల్, సీసం వంటి విషపూరిత భారీ లోహాలతో భారీగా కలుషితమైందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2050 నాటికి 90 శాతం భూమి ప్రమాదకర లోహాలతో కలుషితమయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు.

14 నుంచి 17 శాతం కాలుష్యం

డెయి హౌ ఆయన సహచరుల నేతృత్వంలోని బృందం ప్రపంచ కాలుష్య నమూనాలపై అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,493 ప్రాంతాల నుంచి అత్యాధునిక మెషీన్ల ద్వారా దాదాపు 8,00,000 నేల నమూనాలను సేకరించి విశ్లేషించింది. ప్రపంచంలోని సాగుచేసే భూములలో 14 నుంచి 17 శాతం అంటే సుమారు 242 మిలియన్ హెక్టార్లు సాగుభూమి మానవ ఆరోగ్య పరిమితులను మించి కనీసం ఒక లోహంతో కలుషితమైంది. ఒకటికి మించి ఎక్కువ లోహాలు సైతం ఉండొచ్చునని అధ్యయనం అంచనా వేసింది.

ఈ కాలుష్యం కారణంగా పంట దిగుబడి తగ్గుతుంది. విషపూరిత లోహాలను ఆహార పదార్ధాల త్వారా తీసుకుంటున్నాం. మరోవైపు మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి భారీగా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  యురేషియా అంతటా భూమి లోహాల వల్ల కలుషితం అవుతోంది. ఈ ప్రమాదకర జోన్ లోహాలు అగ్నిపర్వతాలు, ఇతర సహజ భౌగోళిక కారకాల కారణంగా, మైనింగ్, పారిశ్రామికీకరణ, నీటిపారుదల పద్ధతులలో లోపాలతో సమస్యగా మారుతున్నాయి. లోహాలు వాతావరణంలో కీలకపాత్ర పోషిస్తాయి. 

విష పూరిత లోహాలతో జాగ్రత్తకాడ్మియం కారణంగా ముఖ్యంగా దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. నికెల్, క్రోమియం, ఆర్సెనిక్, కోబాల్ట్ వంటి లోహాలు కూడా సురక్షితమైన స్థాయిలను మించిపోతాయి. ఈ విషపూరిత లోహాలు దశాబ్దాలుగా నేలలో ఉండగలవు. దాంతో ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేహించి తీవ్ర అనారోగ్యం, వ్యాధులకు కారకాలుగా మారుతున్నాయి. నాడీ సంబంధిత లోపాలు సైతం తలెత్తుతాయి.

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలతో లోహాల కలయికతో భూసారం దెబ్బతింటోంది. తక్షణం చర్యలు  తీసుకోకపోతే నేల కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ నిబంధనలు, నేల పర్యవేక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ప్రజలకు అవగాహన కల్పించడం మంచిదని నిపుణులు సూచించారు. ఇకనుంచి ప్రజలు సైతం బాధ్యతగా నడుచుకోవాలని, పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయకూడదని చెబుతున్నారు.