Jallikattu 2024 Begins In Tamil Nadu: ప్రతి ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు (Jallikattu) పోటీలు తమిళనాడులో ప్రారంభమయ్యాయి. జనవరి 15న అవనియాపురం, 16న పాలమేడ్, 17న అలంకనల్లూరులో జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడు లోని మధురై (Jallikattu in Madurai) జిల్లాలో  ఈ జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడగా పరిగణిస్తారు. జంతువులకు ఏ హాని కలగకూడదంటూ జల్లికట్టుపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని నిరసిస్తూ మెరీనా బీచ్ లో మొదలైన నిరసన రాష్ట్రమంతటా వ్యాపించి పెద్ద ఎత్తున ఉద్యమంలా మారింది. జల్లికట్టులో గెలుపొందిన ఎద్దులకు, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, నజరానా సైతం అందజేస్తారు. ఈ ఏడాది సైతం తమిళనాడులో పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు.


మదురై జల్లికట్టు చాలా ఫేమస్
మదురై జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే జల్లికట్టు పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జరిగే జల్లికట్టులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తారు. పలు ప్రాంతాల నుంచి ఎద్దులను కూడా తీసుకొచ్చి జల్లికట్టు ఆడిస్తారు. ఈ ఏడాది కూడా మధురైలోని అలంకనల్లూరు, పాలమేడు, అవనియాపురంలో జల్లికట్టు పోటీలు ప్రతిష్టాత్మకంగా మొదలయ్యాయి. జల్లికట్టు ఆడుతూ కొందరు గాయపడినా, మిగతా వాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గరు. ఈ నెలాఖరులోగా అలంకనల్లూరు సమీపంలోని కీజకరైలో కొత్తగా నిర్మించిన వేదికలో మిరమండ జల్లికట్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారు. జల్లికట్టు ఈవెంట్ మొదలైతే వరుసగా 5 రోజుల పాటు ప్రభుత్వం తరపున ఈ పోటీలు నిర్వహించనున్నారు. 






కారు బహుమతి ప్రకటన
అవన్యాపురం, పాలమేడు, అలంకనల్లూరు జల్లికట్టు పోటీల్లో గెలిచిన ఎద్దుకు సీఎం ఎం.కె.స్టాలిన్‌ తరపున ఒక్కో కారు బహుకరిస్తారు. ఉత్తమ ఎద్దుల పోటీదారుడికి మంత్రి ఉదయనిధి తరఫున ఒక్కో కారును బహూకరిస్తారు. మొత్తం మూడు జల్లికట్టు పోటీల్లో మొత్తం 6 కార్లను బహుకరించనున్నారని అధికారులు తెలిపారు.  


జల్లికట్టు మ్యాచ్ వివరాలు..
జనవరి 15, 16, 17 తేదీల్లో నిర్వహించే ఈ మూడు జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు, క్రీడాకారుల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీల్లో మొత్తం 12,176 ఎద్దులు, 4,514 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారు. ఇందులో నేడు ప్రారంభైమన అవనియాపురంలో 2,400 ఎద్దులు, బాలమెట్‌లో 3,677, అలంకనల్లూరులో 6,099 ఎద్దులు పాల్గొంటాయని సమాచారం. గతేడాది 9,701 ఎద్దులు, 5,399 మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొన్నారు. 






జల్లికట్టు ఆట ఏంటంటే..
తమిళనాడులో సంక్రాంతి(Pongal) సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట ఈ జల్లికట్టు (Jallikattu). స్పెయిన్ దేశంలో ఆడే బుల్ గేమ్ తరహాలోనే తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తారు. కానీ స్పెయిన్ లో గేమ్ కి, తమిళనాడు జల్లికట్టుకు రూల్స్ భిన్నంగా ఉంటాయి. జల్లికట్టులో ఎద్దులను చంపడం లాంటివి ఉండదు. ఆ ఎద్దులను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించే ఆటగాళ్లు ఏ ఆయుధాన్ని ఉపయోగించరాదు. ప్రతి ఏడాది సంక్రాంతి నుంచి కొన్ని రోజుల పాటు తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తుంటారు. మదురైకి సమీపంలో ఉన్న అలంగనల్లూరులో నిర్వహించే జల్లికట్టు పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జల్లికట్టును మంజు విరాట్టు అని కూడా పిలుస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.