అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. చంద్రయాన్‌-3తో జాబిల్లిపై జెండా ఎగురవేసింది. మూన్‌పై అడుగుపెట్టి.. విక్రమ్‌ లాండర్‌ను  చంద్రుడి దక్షిణ ధృవంపై దింపి.. చరిత్ర తిరగరాసింది. చంద్రుడి తర్వాత సూర్యుడిపై ఫోకస్‌ పెట్టింది. ఆదిత్య ఎల్‌-1ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు శుక్రుడిని  సోధించేందుకు సిద్ధమవుతోంది. శుక్రగ్రహంపై పరిశోధనలకు త్వరలోనే వీనస్‌ మిషన్‌ చేపడతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు  పేలోడ్లు అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఇండియన్​ నేషనల్​ సైన్స్​ అకాడమీని ఉద్దేశించి మాట్లాడిన ఇస్రో చైర్మన్‌ సోమ్​నాథ్... వీనస్‌ మిషన్‌ను చేపడతామని  ప్రకటించారు. 


శుక్రుడు... సూర్యుడి నుంచి రెండో గ్రహం. సౌరవ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీనిని ఎర్త్‌ సిస్టర్‌ ప్లానెట్‌ అని కూడా అంటారు. శుక్కుడిపై పూర్తిగా మందపాటి  కార్బన్‌ డైయాక్సైడ్‌ వాతావరణం ఉంటుంది. చూట్టూ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలతో కప్పబడి ఉంటుంది.. అందుకే దీనిని వీల్డ్‌ ప్లానెట్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇది లేత  పసుపు రంగులో కనిపిస్తుంది. అంతేకాదు.. శుక్రుడు సౌరవ్యవస్థలో అత్యంత వేడి గ్రహం. సవ్యదిశలో తిరుగుతూ ఉంటుంది. శుక్రగ్రహాన్ని పరిశోధించడం వల్ల.. అంతరిక్ష శాస్త్ర  రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్ తెలిపారు. శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహమని.. దానిపై వాతావరణం చాలా మందంగా  ఉందన్నారు. అంతేకాదు శుక్కుడిపై వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువని అన్నారు. 10వేల సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు కూడా మారిపోవచ్చని.. భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడులా కావచ్చని అన్నారు ఇస్రో చైర్మన్‌. 


నాసా కూడా 2029, 2030, 2031లో వీనస్ మిషన్లు చేపట్టే అవకాశం ఉంది. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం  చేసేందుకు భారతదేశపు తొలి అంతరిక్ష ఆధారిత మిషన్ ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. అనంతరం ఇస్రో వీనస్ మిషన్ పై దృష్టి సారించనుంది.