ISRO Chief Somnath Diagnosed With Cancer: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం వెల్లడైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చంద్రయాన్ 3, ఆదిత్య L1 (Aditya L1) ప్రయోగాల ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం ఖ్యాతిని ప్రపంచదేశాల ముందు నిలబెట్టిన ఘనత ఆయన సొంతం. తాను క్యాన్సర్ బారిన పడ్డాననే షాకింగ్ విషయాన్ని స్వయంగా ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఓ మలయాళం ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సోమనాథ్.. ఆదిత్య L1 ప్రయోగం జరిగిన రోజే తనకు క్యాన్సర్ ఉందని తెలిసినట్లు వెల్లడించారు. 


ఆ సమయంలో ప్రయోగాల్లోనే.. 
చంద్రయాన్‌-3 ప్రయోగం సమయంలోనే అనారోగ్య సమస్యలు వచ్చాయని అప్పుడు అదేంటో తెలియకపోవటంతో.. అంతరిక్ష ప్రయోగాల్లో మునిగిపోయినట్లు సోమనాథ్ తెలిపారు. కానీ ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగించాలనుకున్న రోజు ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుని విధులకు హాజరైనట్లు సోమనాథ్ తెలిపారు. పరీక్షల ఫలితాల్లో తన కడుపులో కణితి పెరిగిందని అది క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించినట్లు సోమనాథ్ వెల్లడించారు. 



క్యాన్సర్ కణితి తొలగింపు
వంశపారంపర్యంగా తనకు క్యాన్సర్ వచ్చిందన్న సోమనాథ్... కీమోథెరపీ చేయించుకోవటంతో ప్రస్తుతానికి క్యాన్సర్ కణితిని తొలగించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందని అన్నారు. ఇస్రో చీఫ్ క్యాన్సర్ సోకినా అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొన్న విషయం ఇప్పుడు ఇస్రో ఉద్యోగులతో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.


సోమనాథ్ నేతృత్వంలో చంద్రయాన్ 3 సక్సెస్.. 
చంద్రయాన్-3 సక్సెస్‌తో ఇస్రో పేరు అంతర్జాతీయంగా మారు మోగింది. ఎస్ సోమనాథ్ చైర్మన్‌గా.. అత్యంత కష్టమైన సౌత్‌పోల్‌పై ల్యాండర్‌ని చాలా సేఫ్‌గా ల్యాండ్‌ చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరో రెండు లూనార్ మిషన్స్  (ISRO Lunar Missions) చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో రెండు కీలక లూనార్ మిషన్స్‌ని చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి  LuPEx, మరోటి చంద్రయాన్-4 (Chandrayaan-4).ఈ మిషన్‌ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్‌లను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


ఇటీవల ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 4 ప్రయోగంపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఏ స్పేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా పంపాలో మేధోమథనం చేస్తున్నట్లు వెల్లడించారు. పేలోడ్‌గా ఏం ఉండాలి, తదితర అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. చంద్రయాన్ 4 ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని సేకరించి సురక్షితంగా కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రోబో ద్వారా ఇదంతా పూర్తి చేయాలని భావిస్తుండగా... ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉందన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న రాకెట్‌లు అందుకు సహకరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందుకే కొత్తగా వేరే డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఏదేమైనా చంద్రయాన్ 4 గురించి అన్ని వివరాలు బయట పెట్టలేనని.. త్వరలోనే వివరాలు చెబుతామన్నారు.