IRCTC Website And Mobile App Down: రైల్వే టికెట్ బుకింగ్స్ కోసం ఏర్పాటైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు చెందిన వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. దీంతో టికెట్ సేవలకు అంతరాయం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారు సైట్ పనిచేయక అసహనం వ్యక్తం చేశారు. వెబ్ సైట్, మొబైల్ యాప్ ఓపెన్ కావడం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఉదయం నుంచీ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఐఆర్‌సీటీసీ సంస్థ స్పందించింది. నిర్వహణపరమైన పనులు చేపట్టడంతోనే టికెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని సంస్థ పేర్కొంది.


'మెయింటెనెన్స్ పనుల కారణంగా.. ఈ టికెట్ సేవలు అందుబాటులో లేవు. టికెట్ రద్దు చేసుకోవడానికి ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ లేదా etickets@irctc.co.in కు మెయిల్ చేయండి.' అని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తెలిపింది. కాగా, రైల్వే వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండోసారి. 2 వారాల క్రితం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. అప్పుడు కూడా సరిగ్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే సైట్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.


ఎయిర్‌టెల్ సేవల్లోనూ..


అటు, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సేవలకూ గురువారం అంతరాయం ఏర్పడింది. మొబైల్ డేటా, బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ అంతరాయం నెలకొంది. కాల్స్, ఇంటర్నెట్ వాడకంలో ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎయిర్‌టెల్ సంస్థ అధికారికంగా స్పందించలేదు.


Also Read: New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!