IRCTC New Rules For Online Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఇక నుంచి మీ వ్యక్తిగత ఐడీపై మీకు, లేదా మీ కుటుంబ సభ్యులకు, మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులపై మాత్రమే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేయాలి. అలా కాకుండా మీ స్నేహితులకో, తెలిసిన వారికో మీ ఐఆర్‌సీటీసీ (IRCTC) ఐడీపై టికెట్లు బుక్ చేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. అలా చేస్తే జైలు శిక్ష, జరిమానా విధించేలా .. టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం.. ఇకపై కేవలం అధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై రిజర్వేషన్ టికెట్లు బుక్ చేయాలి.
జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ..
మీ వ్యక్తిగత ఐడీపై ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. రూ.10 వేల జరిమానా, లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారు. కాబట్టి మీ ఐడీని ఇతరులెవరికీ ఇవ్వొద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. సంబంధం లేని వారికి టికెట్లు బుక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, ఐఆర్‌సీటీసీ ఐడీకి ఆధార్ అనుసంధానం చేసిన వారు నెలకు 24, అనుసంధానం చేయని వారు 12 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ సమయంలో కొత్త నిబంధనల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఈ రైళ్లు రద్దు
అటు, విశాఖ నుంచి విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ నెల 23 (ఆదివారం) నుంచి ఆగస్ట్ 11 వరకూ ఈ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. విజయవాడ డివిజన్‌లోని నిడదవోలు - కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయడంతో ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 10 వరకూ రాజమండ్రి - విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ - రాజమండ్రి ప్యాసింజర్ (07467), గుంటూరు - విశాఖ (17239) సింహాద్రి, విశాఖ - గుంటూరు (17240) రైళ్లు రద్దయ్యాయి. అలాగే, విశాఖ - విజయవాడ (12717), విజయవాడ - విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ ప్రెస్.. గుంటూరు - విశాఖ (22702), విశాఖ - గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ - తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దైనట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 10 వరకూ.. మచిలీపట్నం - విశాఖ (17219), విశాఖ - మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్ రద్దైంది. అలాగే, గుంటూరు - రాయగఢ్ (17243), రాయగఢ్ - గుంటూరు (17244), లింగంపల్లి - విశాఖ (12806), విశాఖ - లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. అటు, ఈ నెల 24 నుంచి ఆగస్ట్ 9 వరకూ తిరుపతి - విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ సైతం రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, కీలక రైళ్లు రద్దు కావడంతో ఇబ్బందులు తప్పవని... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులకు కోరుతున్నారు.
Also Read: Free Bus Scheme: రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన