Prajwal Revanna Scandal Case: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో తాజాగా ఆయన సోదరుడు కూడా అరెస్టు అయ్యారు. జేడీ(ఎస్) ఎమ్మెల్సీగా ఉన్న సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు ఆదివారం (జూన్ 23) అరెస్టు చేశారు. శనివారమే సూరజ్ రేవణ్ణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రోజు రాత్రి ఆయన్ను ప్రశ్నించడం కోసం పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. 


శనివారం రాత్రి కొన్ని గంటల పాటు సూరజ్ రేవణ్ణను హోలెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆదివారం ఉదయం సూరజ్ రేవణ్ణను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు తమ్ముడు. అశ్లీల వీడియోల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఎంపీ ప్రజ్వల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో తాజాగా తమ్ముడు సూరజ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 


సూరజ్ రేవణ్ణపై పోలీసులు ఐపీసీలోని 377 (అసహజ లైంగిక క్రియ), 342 (అక్రమ నిర్బంధం), 506 (నేరపూరిత బెదిరింపు) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సూరజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్ కేఎస్ అనే జేడీ(ఎస్) కార్యకర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ఆయన నిర్వహించిన ఓ ఫంక్షన్‌లోనే తనకు సూరజ్ పరిచయం అయ్యారని బాధితుడు వెల్లడించాడు. 


లోక్‌సభ ఎన్నికల వేళ తన పనిని మెచ్చి సూరజ్ రేవణ్ణ తన ఫోన్ నంబర్‌ తీసుకున్నట్లుగా అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలా ఖాళీగా ఉన్నప్పుడల్లా తనను కలవాలనుకుంటున్నట్లు చెప్పేవాడని.. అందులో భాగంగానే ఓసారి గన్నికాడ అనే గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రానికి రావాలని సూరజ్ రేవణ్ణ కోరినట్లు బాధితుడు వెల్లడించాడు. పొలానికి చేరుకున్న తర్వాత సూరజ్ గది లోపలి నుంచి తాళం వేసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. తన కోర్కె తీర్చినందుకు గానూ రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉండేలా సూరజ్ తనకు భరోసా ఇచ్చినట్లుగా వెల్లడించాడు. ఆ తర్వాత మళ్లీ సూరజ్ తనను పిలిచినప్పటికీ తాను రానని చెప్పడంతో బెదిరించాడని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.