Yoga Day Guinness Record: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ లోని సూరత్ లో 1.53 లక్షల మంది ఒకేసారి యోగా చేయడం ద్వారా ఈ గిన్నిస్ రికార్డ్ సాధించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూరత్ లో ఒకేసారి 1.53 మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. ఒకేచోట అతిపెద్ద యోగా సెషన్ గా ఇది రికార్డు సృష్టించిందని, అలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారని గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ యోగా కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్ లోని కోటా నగరం పేరిట ఉండేది. 2018 వ సంవత్సరంలో ఒక లక్షా 984 మంది ఒకేసారి యోగాసనాలు వేసి అతిపెద్ద యోగా సెషన్ గా అప్పుడు రికార్డుల్లోకెక్కారు. అయితే  తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి సూరత్ గిన్నిస్ రికార్డు సాధించింది.


ఈ అతి పెద్ద యోగా సెషన్ కు 1.25 లక్షల మంది వస్తారని మొదట నిర్వాహకులు అంచనా వేశారు. కానీ ఈ యోగా కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ఏకంగా 1.53 లక్షల మంది వచ్చారు. వీరందరిని 10 కిలోమీటర్ల పొడవైన రోడ్డుపై ఇరు వైపులా 1.53 లక్షల మంది యోగాసనాలు వేశారు. మొత్తం 135 బ్లాకులుగా విడగొట్టారు. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారని సూరత్ మున్సిపల్ అధికారులు తెలిపారు. యోగా కార్యక్రమాన్ని పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు.. అనంతరం గిన్నిస్ ధ్రువీకరణ పత్రాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు అందించారు. 






ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవం


తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రముఖులంతా యోగాసనాలు వేశారు. రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు.


Also Read: యోగా డే స్పెషల్ - ఆధ్యాత్మికంలో గడిపిన మిల్కీ బ్యూటీ!


అమెరికా నుంచి ప్రధాని యోగా సందేశం


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియో సందేశం ద్వారా మీ అందరితో కనెక్ట్ అవుతున్నానని, కానీ యోగా కార్యక్రమం మిస్‌ కావడం లేదన్నారు ప్రధాని మోదీ. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే భారీ యోగా కార్యక్రమంలో పాల్గొంటాను అన్నారు. భారత్ పిలుపు మేరకు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఏకతాటిపైకి రావడం చారిత్రాత్మకం అని అభిప్రాయపడ్డారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదన వచ్చినప్పుడు రికార్డు స్థాయిలో దేశాలు మద్దతిచ్చాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది. ఓషన్ రింగ్ ఆఫ్ యోగాతో ఈ ఏడాది యోగా డే కార్యక్రమాలు మరింత ప్రత్యేకమయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial