Indigo OverAction  :   విమానయాన సంస్థ ఇండిగోకు  5 లక్షల రూపాయల  జరిమానా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. విమానంలోకి ఓ దివ్యాంగ బాలుడిని ఎక్కనీయకుండా అవమానించినట్లుగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  మే 7న   దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది.  దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. 



 



 ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.   ఇది విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి వెళ్లింది.  దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. స్వయంగా సింధియానే దర్యాప్తును పర్యవేక్షించారు.  ఈ ఘటనపై  విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. 



ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది.  అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని  కూడా ఆదేశించింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల  జరిమానా విధించింది.