IAS Keerti Jalli : అస్సాంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ముఫ్పై మందికిపైగా చనిపోయారు. ఐదు లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. కానీ ఈ ప్రకృతి విపత్తులో ఓ మహిళా ఐఏఎస్ అధికారి వరద బాధితులకు అండగా నిలిచిన వైనం వైరల్ అవుతోంది. కష్టాలకు వెరువక వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా  విధులు నిర్వహించింది. ఆమె పనితీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె తెలుగు బిడ్డ కీర్తి జల్లి. 
  
అస్సాంకి క్యాడర్‌కు చెందిన కీర్తి జల్లి రదలు ముంచెత్తుతున్న తరుణంలో స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్‌గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చి బాధితులకు తక్షణం సాయం అందేలా చూశారు.  అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగమే కాదు.. వారిలో ఒకరిగా కలిసిపోయి సేవలు చేసింది. 



అస్సాం క్యాడర్‌లో ఐఎఎస్‌కు సెలక్ట్ అయిన  కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్‌ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్‌ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. 2020 మే నెల నుంచి కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్‌ నియంత్రణ కోసం పోరాటం చేశారు కీర్తి జల్లి. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి  విధులకు హాజరయ్యారంటే ఆమె ఎంత సిన్సియర్‌గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. 



కీర్తి జల్లి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది.  అమె విధినిర్వహణలో ఇలా వ్యవహరించిన విధానాన్ని కూడా ఇతరులే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.