Manoj Naravane: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవానే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో చైనా మ్యాప్ షేర్ చేశారు. వివిధ రంగుల్లో ఉన్న మ్యాప్ లో ఒక ప్రాంతానికి చైనా అని రాసి ఉండగా.. మిగతా ప్రాంతాలకు చైనా ఆక్రమించిన అని రాసి ఉంది. ఆ మ్యాప్ ను పోస్టు చేసిన మాజీ ఆర్మీ చీఫ్.. ఫైనల్లీ నిజమైన చైనా మ్యాప్ ను పొందగలిగారు అంటూ రాశారు. ఈ మ్యాప్ లో లడఖ్, టిబెట్ సహా అనేక ప్రాంతాలను ఆక్యుపైడ్ (ఆక్రమిత) ప్రాంతాలుగా గుర్తించి ఉంది. చైనా, చైనా ఆక్రమిత టిబెట్, చైనా ఆక్రమిత ఈస్ట్ తుర్ఖేస్థాన్, చైనా ఆక్రమిత సౌత్ మాంగోలియా, చైనా ఆక్రమిత మంచూరియా, చైనా ఆక్రమిత యునాన్, చైనా ఆక్రమిత లడఖ్ అని ఆ మ్యాప్ లో రాసి ఉంది.
కొన్ని రోజుల క్రితం చైనా ఓ మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 28వ తేదీన బీజింగ్ ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా పేరుతో విడుదల చేసింది. ఇందులో తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ లను చైనా భూభాగాలుగా చూపారు. అరుణాచల్ ప్రదేశ్,అక్సాయ్ చిన్ లను కూడా చైనా స్టాండర్డ్ మ్యాప్ లో చేర్చడాన్ని భారత దేశం తీవ్రంగా తిరస్కరించింది. బీజింగ్ కు తన నిరసనను వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింతగా జటిలం చేస్తుందని, క్లిష్టతరం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం జపాన్, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి అనేక ఆసియాన్ సభ్య దేశాలు కూడా చైనా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ పై తీవ్రంగా స్పందించాయి. దక్షిణ చైనా సముద్రం తనదే అంటూ చైనా చేస్తున్న ప్రయత్నాలను ఆసియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ను పాటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి.
తైపీలో భారత అధికారుల పర్యటన
ఆగస్టు 8వ తేదీన జనరల్ నరవానే, మాజీ నేపీ చీఫ్ కరంబీర్ సింగ్, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాతో కలిసి తైవాన్ లోని తైపీని సందర్శించి చర్చలు జరిపారు. తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కేతగలన్్ ఫోరమ్ 2023 ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ డైలాగ్ ఈవెంట్ లో తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ ప్రారంభ ప్రసంగం చేశారు. 3 వారాల తర్వాత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఇలాంటి పర్యటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
తైవాన్ అధికారులు, చైనాతో దౌత్య సంబంధాలు కలిగిన దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. తైవాన్ భూభాగం పట్ల చైనా వైఖరి ఇదేనని స్పష్టం చేశారు. కాగా.. తైవాన్ తో భారత దేశం అధికారిక దౌత్య సంబంధాలను కలిగి లేనందు వల్ల జనరల్ నరవానే సహా మరో ఇద్దరు మాజీ చీఫ్ లు తైపీని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.