Pamban Railway Bridge: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న రైల్వే బ్రిడ్జి అది. నీలం రంగు సముద్రంపై అద్భుత వంతెన. ఓడలు వస్తే ఆటోమేటిక్‌గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీతో దీన్ని నిర్మిస్తున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో (Rameswaram) పాంబన్ రైల్వే బ్రిడ్జి (Pamban Railway Bridge) నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీని పక్కనే పాత బ్రిడ్జి ఉంటే అక్కడే ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. సముద్రంలో ఓడలు దీని దగ్గరకు వస్తే సెన్సార్‌తో ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే. 2,070 మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది. కింద ఓడలు సాఫీగా వెళ్లిపోతాయి. సముద్రంపై జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా... సరుకు రవాణాకు అడ్డంకి కాకుండా అటు రైలు ప్రయాణాలు సాఫీగా సాగేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా తాజాగా వైరల్ అవుతోంది.




ఇంతకు ముందున్న పాత బ్రిడ్జి దాదాపుగా ఇక్కడ 110 ఏళ్ల క్రితం నిర్మించారు. ఏవైనా ఓడలు వస్తే దాన్నికున్న పాసింగ్ గేట్స్‌ను మనుషులు నిలబడి లాగాల్సి వచ్చేది. ఫలితంగా బ్రిడ్జి పైకి లేచి ఓడలు వెళ్లేందుకు వీలు కలిగేది. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి మనుషుల అవసరం లేకుండా సెన్సార్లతో పని చేసేలా ఈ సముద్రపు రైల్వే వంతెన భారతీయ రైల్వే శాఖ సొంతంగా నిర్మించింది. ఫుల్లీ ఆటోమెటేడ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ద్వారా 17 మీటర్లు ఈ బ్రిడ్జి పైకి లేచేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దీనిపై టెస్ట్ రన్ కూడా విజయంవంతగా పూర్తి చేశారు. ఇకపై దీని మీద రైలు ప్రయాణాలు ప్రారంభించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి రైల్వే శాఖ అధికారులు లేఖలు కూడా రాశారు. సేఫ్టీ రన్స్ అన్నీ పూర్తి అవటంతో కేంద్రం నుంచి అనుమతులు రాగానే దీనిపై రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఫలితంగా దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి వర్టికల్ రైల్వే వంతెనగా పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జి చరిత్రపుటల్లోకి ఎక్కనుంది.


మరిన్ని విశేషాలు..



  • ఈ వంతెన నిర్మాణ పనులు 2019, నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దీని నిర్మాణానికి సుమారు రూ.250 కోట్లు వెచ్చించింది.

  • ఈ బ్రిడ్జి బంగాళాఖాతంలోని పంబన్ దీవికి, దేశానికి అనుసంధానంగా ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే రామేశ్వరానికి రైళ్లు అధిక వేగంతో నడిపేందుకు.. అలాగే అధిక బరువున్న లోడ్ తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. 

  • పాత పాంబన్ వంతెనను 1914లో అందుబాటులోకి తీసుకురాగా.. ఆ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేశారు.


Also Read: Maharastra Elections : ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !