Droupadi Murmu in Ayodhya: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (మే 1) ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ఆమె చాలా సేపు ప్రార్థనలు చేశారు. రామ జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో గత జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఆమె ఈ రామాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిర్ ఫోర్స్ విమానంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మందిరానికి వెళ్లారు.


దేశమంతా ఎన్నికల హడావుడి జరుగుతున్న వేళ ద్రౌపది ముర్ము అయోధ్య పర్యటన సాగింది. అయోధ్యలో దాదాపు నాలుగు గంటలపాటు ద్రౌపది ముర్ము ఉండగా.. ఆమె యాత్ర పూర్తిగా ఆధ్యాత్మికంగా సాగింది. రాష్ట్రపతి తన సందర్శనలో ఎక్కువ భాగం శ్రీరామ మందిరంలో గడిపారు. రాష్ట్రపతి కార్యక్రమానికి రామమందిరం కాంప్లెక్స్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రపతి రాంలల్లా దర్శనంతో పాటు ఆరాధ్య హారతిలోనూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆమె శివాలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఆ శివాలయం కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంది.


ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేశారు. ఈ శివాలయం కుబేర్ తిలాపై ఉందని.. ఇది భారత పురావస్తు శాఖ రక్షించించిన ఓ స్మారక చిహ్నం అని అంటారు. రుద్రయామల్ అనే అయోధ్య చరిత్రను వివరించే పుస్తకం ప్రకారం.. సంపదకు దేవుడు అయిన కుబేరుడు యుగాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అతను కుబేరేశ్వర్ మహాదేవ్ అని పిలిచే శ్రీరాముని జన్మస్థలం సమీపంలో ఎత్తైన గుట్టపై ఈ శివలింగాన్ని స్థాపించినట్లుగా చెబుతారు.


ద్రౌపది ముర్ము ఆలయాన్ని సందర్శించిన తర్వాత.. ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి రామ్ లల్లా పట్ల ఎంతో అంకితభావంతో ఉన్నారని అన్నారు. ఆమెను అక్కడ చూస్తుంటే చాలా గొప్పగా అనిపించిందని అన్నారు. రాష్ట్రపతి హారతి నిర్వహించి రామ్ లల్లాకు నమస్కరించినట్లు ఆయన తెలిపారు. 






అయోధ్య మందిరం ప్రాణ ప్రతిష్ఠ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె గిరిజనురాలు కాబట్టే ప్రభుత్వం ఆమెను ఆహ్వానించలేదని విపక్షాలు ఆరోపించాయి. దేశంలోని ప్రముఖులు అందర్నీ ఆహ్వానించి బీజేపీ సర్కారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.