Boy Dies After Consuming Dry Ice: ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల బాలుడు డ్రై ఐస్ తిని (Dry Ice) ప్రాణాలు కోల్పోయాడు. గత వారంలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లిన బాలుడు అక్కడ ఫాగ్ ఎఫెక్ట్స్ కోసం తీసుకొచ్చిన ఐస్‌ని ఐస్‌క్రీమ్ అనుకుని తినేశాడు. ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. మామూలు ఐస్ అని పొరపాటు పడి డ్రై ఐస్‌ని మింగడం వల్ల బాలుడు ఇలా అనారోగ్యానికి గురై మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. డ్రై ఐస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఈ ఐస్‌ని తినకూడదని తేల్చి చెబుతున్నారు. గత నెల కూడా ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. గుడ్‌గావ్‌లోని ఓ కేఫ్‌లో మౌత్ ఫ్రెషనర్ పేరుతో డ్రై ఐస్‌ని సర్వ్ చేశారు. ఈ ఐస్‌ని తిన్న ఐదుగురు ఆసుపత్రిపాలయ్యారు. తిన్న వెంటనే వాళ్లు రక్తం కక్కుకున్నారు. నోరంతా మండిపోయింది. మౌత్ ఫ్రెష్‌నర్ అనుకుని పొరపాటున డ్రై ఐస్‌ని సర్వ్ చేసినట్టు కేఫ్ సిబ్బంది సంజాయిషీ చెప్పింది.
ఏంటీ డ్రై ఐస్..?
డ్రై ఐస్ అనేది అసలు ఐస్ కాదు. కార్బన్ డయాక్సైడ్‌తో తయారు చేసిన ఓ ఘనపదార్థం. చూడడానికి ఐస్‌లానే ఉంటుంది. ప్రమాదవశాత్తు దీన్ని నోట్లో వేసుకుంటే నోరంతా మంటెక్కుతుంది. ఫుడ్, ఫార్మసీ ఇండస్ట్రీలలో ప్రొడక్ట్స్‌ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు ఈ డ్రై ఐస్‌ని వాడతారు. -78 డిగ్రీల సెల్సియస్ వద్ద తయారు చేసే ఈ ఐస్‌ని ఆహార పదార్థాల ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి తొందరగా కరిగిపోవు. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమూ ఈ డ్రై ఐస్‌ని వాడతారు.