Indian Embassy In US Issues Emergency Helpline: అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న ఇరత దేశాల వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం పిడుగు లాంటి వార్తే. H-1B వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం ప్రకటన చేయడంతో భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం అత్యవసర సహాయం కోరుకునే జాతీయుల కోసం అత్యవసర హెల్ప్ లైన్‌ను ప్రారంభించింది.
అత్యవసరానికి మాత్రమే..‘అత్యవసర సహాయం కోరుకునే భారతీయ పౌరులు +1-202-550-9931 (మరియు WhatsApp) సెల్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్‌ను తక్షణ అత్యవసర సహాయం కోరుకునే భారతీయ పౌరులు మాత్రమే ఉపయోగించాలి. సాధారణ కాన్సులర్ కోసం కాదు’ అని రాయబార కార్యాలయం Xలో వెల్లడించింది.
టెకీలు, సంస్థల్లో తీవ్ర ఆందోళనH-1B వీసా పూల్‌లో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో కొత్త రుసుము ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. H-1B వీసాల్లో 71 శాతం భారతీయులకు జారీ చేయబడ్డాయి. దీంతో ఆశావహులైన భారత టెకీలతోపాటు టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
రుసుము కొత్త వారికి మాత్రమే...కొత్త నిబంధన తాజా H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని మరియు ప్రస్తుత వీసా హోల్డర్లు లేదా రెన్యూవల్స్‌కు కాదని US పరిపాలన సీనియర్ అధికారి స్పష్టం చేశారు. “దేశాన్ని సందర్శిస్తున్న లేదా వదిలి వెళ్తున్న లేదా భారతదేశాన్ని సందర్శిస్తున్న వారు తొందరపడి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. $100,000 రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రుసుము కొత్త వారికి మాత్రమే. ప్రస్తుత వీసా హోల్డర్లకు కాదు” అని అధికారి ANIకి తెలిపారు.
ప్రయాణికులకు ప్రభుత్వం పూర్తి మద్దతు 24 గంటల్లో అమెరికాకు రావాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుంది. ప్రభావిత భారతీయ పౌరులకు, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో తిరిగి ప్రయాణించే వారికి పూర్తి మద్దతు ఇవ్వాలని యూఎస్‌లోని అన్ని మిషన్లు, పోస్ట్‌లను ఆదేశించింది. ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చేవరకు అత్యవసర సహాయం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
నిశితంగా సమీక్షిస్తున్నట్లు వెల్లడించిన MEAH-1B వీసా రుసుముల మార్పు అంశాన్ని నిశితంగా సమీక్షిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘యూఎస్ H-1B వీసా ప్రోగ్రామ్‌పై ప్రతిపాదిత పరిమితులకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. H-1B ప్రోగ్రామ్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై స్పష్టతనిస్తూ ప్రాథమిక విశ్లేషణ రిలీజ్ చేసింది" అని MEA ప్రతినిధి తెలిపారు.