Gallantry Award: ఇండియన్ ఆర్మీకి చెందిన ఫాంటమ్ అనే సైనిక శునకం గ్యాలంట్రీ అవార్డుకు ఎన్నికైంది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఈ కుక్క మే 25, 2020న జన్మించింది. ఆగస్టు 12, 2022న సైన్యంలో మోహరించింది. సైనికులు ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో వీరమరణం పొందింది. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడిలో ఈ ఆర్మీ డాగ్ ప్రాణాలు విడిచింది. తీవ్రమైన గాయాలైనప్పటికీ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సైన్యానికి అందించింది.
జమ్మూ కాశ్మీర్‌లో అక్నూర్ సెక్టార్‌లో ఎలైట్ 9 పారా స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు మోహరించిన బెల్జియన్ మాలినోయిస్ ఫాంటమ్‌కు మరణాంతరం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం శౌర్య పురస్కారం ప్రకటించింది. దేశ రక్షణలో చూపిన ధైర్యం, సాహసం, శౌర్యానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నారు. గతేడాది ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఫాంటమ్ ప్రాణాలు కోల్పోగా.. టెర్రరిస్ట్‌ల రహస్య స్థావరాలను గుర్తించడంలో సైన్యానికి సహాయం చేసింది. శరీరమంతా తీవ్ర గాయాలతో నిండిపోయినప్పటికీ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు చూపి ప్రాణ త్యాగం చేసింది. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన 58 డెస్పాచ్‌లలో ఫాంటమ్ తో పాటు మరో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు దక్కింది.
బెల్జియన్ మాలినోయిస్ ఫాంటమ్ గురించి
ఫాంటమ్ కుక్క మే 25, 2020న జన్మించింది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఈ శునకం ప్రత్యేకంగా శిక్షణ పొంది 2022 ఆగస్టు 12వ తేదీన ఆర్మీలో చేరింది. ఆ తర్వాత అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య దాదాపు 8 గంటలపాటు జరిగిన కాల్పుల్లో ఫాంటమ్ ప్రాణాలు విడిచింది. జమ్మూకు 85 కిలోమీటర్ల దూరంలోని అక్నూర్ ఖుర్ లో ఆర్మీ కాన్వాయ్‌లోని అంబులెన్స్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులను తట్టుకుని, వారిని గురించిన సమాచారాన్ని ఫాంటమ్ కనుగొన్నట్లు సైనిక అధికారులు తెలిపారు. అంతేకాదు ఫాంటమ్.. ఉగ్రవాదులు దాచిన పేలుడు పదార్థాలను, వారు తప్పించుకునే మార్గాలను సైతం గుర్తించింది. దళాల ముట్టడిని బలోపేతం చేయడంలో సహాయపడింది. ఫాంటమ్ బలిదానం తర్వాత నివాళర్పించిన ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ.. ఆపరేషన్ తో తాము డాగ్ ఫాంటమ్ ను కోల్పోయామన్నారు. ఈ శునకం త్యాగం వల్లనే ఈ రోజు చాలా మంది ప్రాణాలతో ఉండగలిగారన్నారు.
76వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా సైన్యం, ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కేంద్రం మొత్తం 93 గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో 2 కీర్తి చక్ర, 14 శౌర్యచక్ర, 1 బార్ టు సేన మెడల్, 66 సేన మెడల్స్, 8 వాయు సేన మెడల్స్, 2 నావో సేన మెడల్స్ ఉన్నాయి.
Also Read : Republic Day 2025 LIVE: ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము