India To Launch Over 100 Satellites By 2040: రానున్న 15 ఏళ్లలో రోదసీ రంగంలో భారత్​ భారీ విజయాలు సాధించనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.  100కు పైగా శాటిలైట్స్​ను నింగిలోకి ప్రయోగించనుందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన నేషనల్​ స్పేస్​ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత స్పేస్​ సెక్టార్​కు సంబంధించిన 15 ఏళ్ల రోడ్​ మ్యాప్​ను ఆవిష్కరించారు. 2040 వరకూ, ఆపైన భారత రోదసి కార్యక్రమాలకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. 

Continues below advertisement


సాంకేతిక ఆవిష్కరణలు, దేశ పురోగతికి..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న 15 ఏళ్లలో ప్రయోగించే ఉపగ్రహాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక మిషన్లు, ప్రైవేటు రంగానికి సంబంధించిన ఉపగ్రహాలు ఉంటాయన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఆహార, నీటి భద్రతకు, విపత్తులను ఎదుర్కోవడానికి, పర్యావరణ పరిరక్షణ, సమ్మిళిత అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. భారత రోదసి కార్యక్రమం ట్రాన్స్​ఫర్మేషన్​ దశకు చేరుకుందన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, దేశ పురోగతి, ప్రజా సంక్షేమంలో కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు.


2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపుతాం
ఈ ఏడాది చివరిలోగా మానవరహిత గగన్​ యాన్-1ను ప్రయోగిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 2027లో దేశ తొలి మానవసహిత రోదసియాత్రను చేపడతామన్నారు. 2028లో చంద్రయాన్-4, 2035లో భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపుతామని తెలిపారు.


వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి
అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్​ సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్ల కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలు ఊపందుకుంటున్నాయని వెల్లడించారు. ‘ఒకప్పుడు రోదసీ రంగం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితమై ఉండేది. ఇప్పుడు వందలాది స్టార్టప్​ పరిశ్రమలు గ్రహాంతర పరిశోధనల నుంచి రోజువారీ పాలనవరకూ అనేక అంశాల్లో ఉపయోగపడే పరిజ్ఞానాలను డెవలప్​ చేస్తున్నాయి. నేడు రోదసీరంగం ప్రజాజీవితాల్లోకి విస్తృతంగా ప్రవేశించింది’ అని అన్నారు. 


ప్రైవేట్ సంస్థలు కీలక భాగస్వాములు కానున్నాయి
అంతరిక్ష రంగం ఇకపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కే పరిమితం కాదని, వందలాది స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ కంపెనీలతో కూడిన డైనమిక్ పర్యావరణ వ్యవస్థగా మారిందని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలు తమ వినూత్న విధానాలతో కీలక భాగస్వాములు కానున్నాయని అన్నారు.


వీనస్​ వద్దకు ఆర్బిటర్ మిషన్​ను పంపుతాం: ఇస్రో చైర్మన్​
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ మాట్లాడుతూ.. వీనస్​ గ్రహం వద్దకు వీనస్ ఆర్బిటర్ మిషన్​ను పంపుతామని  వెల్లడించారు. కొత్తతరం ఎన్సీఎల్పీ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.


ప్రపంచం మొత్తం ఉత్సాహంగా ఉంది: శుభాంశు శుక్లా
ఇటీవలే అంతరిక్ష యాత్ర పూర్తిచేసుకొని భూమిపైకి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష కార్యక్రమం పట్ల ప్రపంచం మొత్తం ఉత్సాహంగా ఉందని అన్నారు. గగన్​యాన్, భారత్ అంతరిక్ష కేంద్రం రూపంలో భారత్ చాలా పెద్ద లక్ష్యాలు ఏర్పరుచుకుందని చెప్పారు. విద్యార్థులు ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.