AP CM Chandrababu Net Worth | న్యూఢిల్లీ: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశ ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది, ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తి 1,600 కోట్ల రూపాయలు, ఇందులో ఒక్క చంద్రబాబు ఆస్తి 931 కోట్ల రూపాయలు అని అంచనా వేసింది.
నివేదిక ప్రకారం, ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. మూడు దశాబ్దాల క్రితం ఆయన స్థాపించిన వ్యాపార సంస్థ 'హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్'తో ఆయన సంపాదన ముడిపడి ఉంది, ఇది ఇప్పటికీ అద్భుతంగా కొనసాగుతోంది.
దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల ఆస్తులు
ఇతర ముఖ్యమంత్రుల విషయానికి వస్తే.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ 332 కోట్ల రూపాయల ఆస్తితో ఈ Richesh CM In India జాబితాలో చంద్రబాబు తరువాత రెండవ స్థానంలో ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు. నాగాలాండ్ సీఎం నిఫ్యూ రియో రూ.46 కోట్లు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రూ. 42 కోట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యల్పంగా రూ.15 లక్షల ఆస్తిని కలిగి ఉన్నారు. జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తిని, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోటి రూపాయల ఆస్తి విలువ ప్రకటించారని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తి 3 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. చాలా మంది ముఖ్యమంత్రులు కోటీశ్వరులుగా ఉన్నారు. ఇది భారతదేశ రాజకీయాలలో ఆస్తి, సంపాదనలో చాలా వ్యత్యాసాన్ని చూపుతుంది.
అప్పుల్లో టాప్ 3 సీఎంలుఅరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు రూ.180 కోట్ల అప్పులు ఉన్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేరిట రూ.23 కోట్ల అప్పులున్నాయి. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు పేరిట ఉన్న అప్పుల విలువ రూ.10 కోట్లు ఉంది.
కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తి కలిగిన సీఎంలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ముఖ్యమంత్రులు 16 మంది ఉన్నారు. రూ.11 కోట్ల నుంచి రూ.49 కోట్ల వరకు ఆస్తి కలిగి ఉన్న సీఎంలు 9 మంది ఉన్నారు. రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్న ముఖ్యమంత్రులు కేవలం ముగ్గురు మాత్రమే.
దేశంలో మొత్తం 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే కేవలం 2 రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులు ఉండగా, 28 రాష్ట్రాల్లో పురుషులు సీఎంలుగా ఉన్నారు.
7000 రూపాయలతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్
ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే 1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. అప్పుడు భారతదేశ పాల ఉత్పత్తి రంగం ఆర్థిక సంస్కరణల కింద ప్రైవేట్ పెట్టుబడులకు డోర్లు తెరిచారు. కేవలం 7000 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ 1994లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో దాని IPO 54 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. ఆ ఐపీఓ ద్వారా 6.5 కోట్ల రూపాయలు సేకరించారు.
మూడు దశాబ్దాలలో హెరిటేజ్ 17 రాష్ట్రాల్లో తమ ఉనికిని, దాదాపు 3 లక్షల పాడి రైతులతో భాగస్వామ్యంతో ఒక అఖిల భారతీయ బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది. హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఆర్థిక సంవత్సరం 2000 నాటికి 100 కోట్ల రూపాయల నుంచి ఆర్థిక ఏడాది 2025 నాటికి 4,000 కోట్లకు పెరిగింది.