Telangana BC Reservations local elections: హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా పలు అంశాలపై నేతలు చర్చించారు.
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందు కోసం బిల్లు ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దాంతో చట్టపరంగా ఇవ్వడం సాధ్యం కావడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై నెలాఖరుకే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. కానీ చేయలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల వివాదం పరిష్కారం కాదు కాబట్టి పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే హామీ కాస్త అయినా నెరవేర్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.
కేసీఆర్ తెచ్చిన చట్టం వల్లే ఇవ్వలేకపోతున్నామన్న వాదన బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నామని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చామని పీఏసీ సమావేశంలో రేవంత్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని.. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామన్నరాు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం..దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని అన్నారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు .. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని రేవంత్ తెలిపారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుంది.. విడిగా సుప్రీం కోర్టు కు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుందన్నారు.
విపక్షాల విమర్శలతో విరుచుకుపడే అవకాశం
ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి.. అలా అయితేనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రచారం చేసి.. ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అని అనడం ఏమిటని విపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇతర పార్టీలు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాయో లేదో కానీ.. అధికారికంగా రిజర్వేషన్లు లేకుండా.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం అనే లెక్కలు వేయడం చాలా కష్టమంటున్నారు.