Afghanistan Earthquake: తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని కారణంగా కనీసం 812 మంది మరణించారు, 2,817 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అందించారు. తాలిబాన్ అధికారి ప్రకారం, ఇది గత దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన భూకంపం. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే ఆసుపత్రులు, ఆశ్రయాలు, ఆహారం మరియు శుభ్రమైన నీరు అవసరం.

ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 27 కిలోమీటర్ల దూరంలో, ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఉంది. దేశం అనేక భూకంప ఫాల్ట్ లైన్లపై ఉంది, దీని వలన భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

సహాయానికి ముందుకొచ్చిన భారత్

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వి అమీర్ ఖాన్ ముత్తకితో మాట్లాడారు.  ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంలో జరిగిన ప్రాణనష్టంపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ, భారత్ కాబూల్లో వెయ్యి కుటుంబాలకు టెంట్లను పంపించిందని తెలిపారు. భారత మిషన్ కాబూల్ నుంచి కునార్ జిల్లాకు 15 టన్నుల సహాయ సామగ్రిని చేరవేసిందని ఆయన చెప్పారు. మరింత సహాయ సామగ్రిని భారత్ నుంచి పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని డాక్టర్ జైశంకర్ ప్రార్థించారు.ఈ కష్ట సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తు అండగా నిలబడుతుందని అన్నారు.

సహాయక చర్యలు- సవాళ్లు

భూకంపం సంభవించిన వెంటనే రెస్క్యూ బృందం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో రోడ్లు మూసుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. చాలా మంది భద్రతా కారణాల దృష్ట్యా తమ ఇళ్లలో ఉండలేకపోతున్నారు, బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోతున్నారు.  

ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ , రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన జాయ్ సింగల్ అల్ జజీరాతో మాట్లాడుతూ, వారి బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు ప్రారంభించాయని చెప్పారు. అయితే, చాలా మారుమూల పర్వత, తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలకు ఇంకా సహాయం అందలేదు. టెంట్ల సంఖ్య కూడా సరిపోలేదు. కొండచరియలు విరిగిపడే ప్రాంతానికి చేరుకోవడం కష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం పశ్చిమ భాగంలో సంభవించిన భూకంపంలో 1,000 మందికిపైగా మరణించారు. అక్టోబర్ 7, 2023 న కూడా దేశంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.