Evaluating Fitness Of Security Personnel: ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ నందీకి సంబంధించిన ఒక సైక్లింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో మంత్రి సైకిల్ తొక్కుతూ కనిపిస్తే, ఆయన భద్రతా సిబ్బంది వెనుక పరుగెత్తుతూ కనిపించారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన బైకథాన్-17 అనే సైకిల్ ర్యాలీలో జరిగింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన బైకథాన్-17 సైకిల్ ర్యాలీలో ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహం, ఎన్‌ఆర్‌ఐ, పెట్టుబడి ప్రోత్సాహం శాఖ మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ నందీ సైకిల్ తొక్కారు. ఈ ర్యాలీలో వందలాది మంది, పిల్లలతో సహా, పాల్గొన్నారు. అయితే, వీడియోలో మంత్రి సైకిల్ తొక్కుతుండగా, ఆయన భద్రతా సిబ్బంది వెనుక పరుగెత్తుతూ కనిపించడం విమర్శలకు దారితీసింది. నెటిజన్లు మంత్రి తన భద్రతా సిబ్బంది శ్రమను పట్టించుకోలేదని, కేవలం ప్రచారం కోసం సైకిల్ తొక్కారని ఆరోపించారు.
సామాజిక మాధ్యమం Xలో ఈ వీడియోపై విస్తృత చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు మంత్రి నందీని "ప్రచారం కోసం రీల్స్ చేస్తున్నారు" అని విమర్శించారు. కొంత మంది మీ సైక్లింగ్ బాగుంది, కానీ భద్రతా సిబ్బందిని కూడా పట్టించుకోవాలని చాలా మంది సలహా ఇచ్చారు. యూపీ క్యాబినెట్ మంత్రి నంద్‌గోపాల్ నందీ, సైకిల్ ర్యాలీ సందర్భంగా తన భద్రతా సిబ్బంది ఫిట్‌నెస్‌ను 'పరీక్షిస్తున్నారు'" అని కొంత మంది సెటైర్లు వేశారు.
నంద్ గోపాల్ నందీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహం, ఎన్‌ఆర్‌ఐ, పెట్టుబడి ప్రోత్సాహం శాఖలకు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రయాగ్‌రాజ్ సౌత్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా (MLA) 2017 , 2022 ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఆయన బహుజన సమాజ్ పార్టీ (BSP)లో ఉన్నారు. ఆయన భార్య అభిలాషా గుప్తా అలహాబాద్ మేయర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలు.
నందీ గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. 2010లో ఆయనపై జరిగిన బాంబు దాడి, 2024లో సైబర్ మోసం కేసు, బ్యూరోక్రసీపై ఆరోపణలు వంటి ఘటనలు ఆయన రాజకీయ జీవితంలో వివాదాస్పద అంశాలుగా ఉన్నాయి. ఈ తాజా సైక్లింగ్ వివాదం ఆయన తీరును మరోసారి బయట పెట్టింది.