I.N.D.I.A Coordination Panel: ప్రతిపక్ష I.N.D.I.A కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరుగుతోంది. పార్టీల మధ్య సీట్ల పంపకం, రాబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. I.N.D.I.A కూటమి మొదటి సమన్వయ కమిటీ భేటీలో ప్రధానంగా సీట్ల పంపకంపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన వ్యూహంపై చర్చిస్తామని ఇప్పటికే డీఎంకే నేత టీఆర్ బాలు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ మీటింగ్స్ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఇది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరగుతోంది.
ముంబయి వేదికగా I.N.D.I.A కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జరుగుతున్న మొదటి సమన్వయ కమిటీ సమావేశంలో సీట్ల షేరింగ్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి నిలబెట్టడానికి ఈ సమావేశం జరుగుతోంది.
14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని I.N.D.I.A కూటమి భావిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లోని సీట్ల పంపకమే సమన్వయ కూటమికి సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సమన్వయ కూటమి సమావేశానికి ముందు మాట్లాడిన ప్యానెల్ సభ్యుడు రాఘవ్ చద్దా.. ప్రజలకు చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చించబోతున్నట్లు తెలిపారు. I.N.D.I.A కూటమి విజయం సాధించాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం, మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని రాఘవ్ చద్దా అన్నారు.
సమన్వయ కమిటీలో ఎవరెవరున్నారంటే
కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, డీఎంకే పార్టీ నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ సమన్వయ కూటమిలో ఉన్నారు. హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లాలన్ సింగ్ (జేడీయూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) సభ్యులుగా ఉన్నారు.