Independence Day 2025: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్‌తో సహా ఉగ్రవాదం అనేక అంశాలపై మాట్లాడారు. ఎర్రకోట మీద నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ పురోగతి, సంస్కరణలపై ఆయన దృష్టి సారించారు. ఆదాయపు పన్ను (Income Tax) చట్టాలలో భారీ మార్పులను ప్రస్తావించారు. ట్యాక్స్ చట్టాలలో 280 కంటే ఎక్కువ సెక్షన్లను తొలగించి, కొన్ని రకాల ఆదాయాలను పన్ను రహితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీపావళి నుంచి దేశ ప్రజలకు ఊరట దక్కుతుందని హింట్ ఇచ్చారు మోదీ. ఆదాయపు పన్ను చట్టాలలో, జీఎస్టీ సంబంధిత అంశాలలో భారీ సంస్కరణలు తీసుకువచ్చామని  ప్రధాని అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. 

కేంద్ర ఆర్థికశాఖ కీలక ప్రకటన

ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీపై కీలక ప్రకటన చేసింది. భవిష్యత్తులో జీఎస్టీలో 2 శ్లాబులే ఉంటాయని స్పష్టం చేసింది. దీపావళి తరువాత నుంచి కొన్ని ఉత్పత్తులపై  ప్రత్యేక రేట్లు వర్తించనున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసం జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు జరుగుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలో స్టాండర్డ్‌, మెరిట్‌ వంటి రెండు జీఎస్టీ రేట్లు ఉంటాయని జీఎస్టీ కౌన్సిల్‌ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సెప్టెంబర్‌లో  జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పిన జీఎస్టీ సంస్కరణలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ట్యాక్స్ సంస్కరణలపై ప్రధాని ఏమన్నారు..

ఈ రోజు (శుక్రవారం) ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ, దీపావళి నాటికి GST (వస్తువులు మరియు సేవల పన్ను)లో తదుపరి తరం కోసం సంస్కరణలు చేపడతామని చెప్పారు. దీని వల్ల సామాన్య ప్రజలపై పన్ను (Tax) భారం తగ్గుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు లాభం కలుగుతుంది. ప్రతి రోజు ఉపయోగించే వస్తువులు త్వరలోనే చౌక అవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ఊతమిస్తూ లాభం చేకూర్చనుందని పేర్కొన్నారు.

సామాన్యుడు ఎంత పన్ను చెల్లిస్తాడు

భారతదేశంలో సాధారణంగా 2 రకాల పన్నులు ఉంటాయి, ఒకటి ప్రత్యక్ష పన్ను.  నేరుగా మీ నుండి ప్రభుత్వం వసూలు చేసేది ప్రత్యక్ష పన్నులు. మీరు పరోక్షంగా ప్రభుత్వాలకు చెల్లించే పన్నును పరోక్ష పన్ను (Indirect Tax) అంటారు. మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు దాదాపు 25 పన్నులను ప్రభుత్వానికి చెల్లిస్తారు. ప్రత్యక్ష పన్నులలో ఆదాయపు పన్ను, షేర్లు లేదా ఆస్తి ఆదాయంపై విధించే పన్ను, వారసత్వంగా వచ్చిన ఆస్తిపై పన్ను, కార్పొరేట్ పన్నులు ఉన్నాయి. పరోక్ష పన్నులు అంటే ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ టాక్స్,  GST, ఇవి నేరుగా తీసుకోరు. కానీ వ్యక్తి ఏదైనా సేవలు వినియోగించుకున్నా లేదా వాటి కొనుగోలుపై పరోక్షంగా పన్ను చెల్లిస్తాడు. ఒక సామాన్య వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంతవరకూ ఎంత పన్ను చెల్లిస్తాడో తెలుసుకుందాం. 

ప్రత్యక్ష పన్నులు (Direct Tax): ప్రభుత్వాలు నేరుగా వ్యక్తుల నుంచి వసూలు చేసే పన్నులు. ఉదాహరణకు: ఆదాయపు పన్ను, షేర్ లేదా ప్రాపర్టీ ఆదాయంపై పన్ను, వారసత్వ సంపత్తిపై పన్ను, కార్పొరేట్ పన్ను.

పరోక్ష పన్నులు (Indirect Tax): ఇవి మీరు ప్రత్యక్షంగా చెల్లించరు. కానీ సేవలు లేదా వస్తువుల కొనుగోలు ద్వారా పరోక్షంగా పన్నులు చెల్లిస్తారు. ఉదాహరణ: ఎక్సైజ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ లాంటివి.

టాక్స్ విషయంలో భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కడ..రిపోర్టుల ప్రకారం.. ప్రతి 100 మంది ఓటర్లలో 7 మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అయినా భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) లెక్కల ప్రకారం, భారత్ త్వరలోనే జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. పన్ను వసూలు వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇది సామాజిక సంక్షేమానికి ఉపయోగపడుతుంది.