PM modi announced gift for Diwali GST reform | న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి సందర్భంగా దేశానికి బిగ్ గిఫ్ట్ అందిస్తామని ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ దీపావళికి మీకు డబుల్ దీపావళి అవుతుందని, దేశ ప్రజలకు పెద్ద బహుమతి లభించనుందని చెప్పారు. భారత్ ఈ రోజు తన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఎర్రకోటపై వరుసగా 12వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం థీమ్ "నయా భారత్"గా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని మోదీ తెలిపారు.
కొత్త GST సంస్కరణలు.. పన్ను తగ్గిస్తామని గుడ్ న్యూస్
GST రేట్లను సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. మేము కొత్త తరం GST సంస్కరణను తీసుకురాబోతున్నాం. సామాన్యులకు పన్నులు మరింత తగ్గుతాయి. GST రేట్లు భారీగా తగ్గించాలని భావిస్తున్నాం, తద్వారా ప్రజలకు మరింత ఊరట కలగనుంది. గత 8 ఏళ్లుగా జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, తరువాత తరానికి మరిన్ని మార్పులు అందించబోతున్నాం. దేశ వ్యాప్తంగా ట్యాక్స్ భారాన్ని తగ్గిస్తామని ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి, అవసరమైతే ఇతరులను బలవంతం చేయడానికి ఉపయోగిస్తామని ప్రధాని అన్నారు.
గత దశాబ్దం సంస్కరణ, పనితీరుపై సమీక్ష
భారత్ ఏ దేశానికి తీసిపోకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఎవరినీ తక్కువ చేయడానికి మన శక్తిని వృథా చేయకూడదు. మనం మన మార్గాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. మనం మన మార్గాలను పెంచుకుంటే, ప్రపంచం కూడా మనల్ని గౌరవిస్తుంది. ప్రపంచంతో పోటీ పెరుగుతున్నప్పుడు, ఆర్థిక స్వార్థం పెరుగుతుందన్నారు. మనం సంక్షోభాల సమయంలో కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. మనం ఓ మార్గాన్ని ఎంచుకుంటే, ఏ స్వార్థం మనల్ని వెనక్కి లాగలేదన్నారు. గత దశాబ్దంలో సంస్కరణ, పనితీరు బాగా రూపాంతరం చెందింది, కానీ ఇప్పుడు మరింత ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే మనం మరింత కొత్త శక్తితో ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.