Independence Day 2023: బిహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్న స్వతంత్ర వేడుకల్లో ఈ అనుహ్య ఘటన జరిగింది. సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు ఆయన హై సెక్యూరిటీ జోన్ లోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసగించారు. ఆ సమయంలోనే ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని నితీశ్ కుమార్ వేదిక వద్దకు పరిగెత్తుకుంటూ దూసుకొచ్చాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆ పోస్టర్ లో రాసి ఉంది. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. 


భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని వేదిక వద్ద నుంచి దూరంగా తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు అతడిని విచారించారు. ఆ వ్యక్తి ముంగేర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నితీశ్ కుమార్ గా గుర్తించారు అధికారులు. ఆ యువకుడి తండ్రి రాజేశ్వర్ పాసవాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పని చేస్తూ విధి నిర్వహణలో ఉండగానే కొన్నేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తనకు కారుణ్య నియామకం కింద సర్కారు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసేందుకు అక్కడికి వచ్చాడు అని పట్నా మేజిస్ట్రేట్ చంద్ర శేఖర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. 






మధ్యప్రదేశ్ వేడుకల్లో అపశృతి


77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మధ్యప్రదేశ్ లో అపశృతి చోటుచేసుకుంది. త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి స్పృహతప్పి వేదిక మీదే పడిపోయారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ప్రభురామ్ చౌదరి చాలా చురుకుగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న క్రమంలో స్పృహతప్పి కింద పడిపోయారు. అటు అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా స్పృహ తప్పి పడిపోయారు. జెండా ఎగుర వేసి గౌరవ వందనం చేసిన తర్వాత స్టేజి పై ఏర్పాటు చేసిన పోడియం వద్దకు వచ్చిన మాట్లాడుతున్న క్రమంలోనే గిరీష్ గౌతమ్ స్పృహ తప్పి కింద పడిపోయారు. అనంతరం వైద్యులను పిలిపించి స్పీకర్ గిరీష్ గౌతమ్ కు గ్లూకోజ్ ఎక్కించారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ను సంజయ్ గాంధీ ఆస్పత్రి రీవాకు తరలించారు.