Independence Day 2023: వాఘా సరిహద్దు దగ్గర రెండు దేశాల సైనికులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. పంద్రాగస్టు నాడు ఇక్కడి సైనికుల విన్యాసాలను చూసేందుకు దేశంలోని మలుమూలల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఇండియా- పాకిస్థాన్ మధ్య ఉండే ఈ వాఘా సరిహద్దు వద్ద ఆగస్టు 15వ తేదీన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1959 నుంచి బీఎస్ఎఫ్ దళం, పాకిస్థాన్ నుంచి పాక్ రేంజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సూర్యాస్తమయానికి ముందు రెండు వైపుల నుంచి సైనికుల తీవ్రమైన కవాతుతో ప్రారంభం అవుతుంది. 77వ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఇక్కడి బీటింగ్ రీట్రీట్ వేడుక ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. 






సూర్యుడు అస్తమించగానే సరిహద్దులోని ఇనుప గేట్లను తెరిచి రెండు జెండాలను ఒకేసారి అవనతం చేస్తారు. ఈ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం రెండు దేశాల మధ్య సోదరభావానికి, సహకారాని చిహ్నంలా ఉంటుంది. ఈ విన్యాసం సాగుతున్నప్పుడు భారత్ మాతాకీ జై, వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలతో ప్రజల హోరు ప్రతిధ్వనిస్తుంది. వాఘా సరిహద్దు స్వాతంత్ర్య వేడుకలు నిజంగా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. 






ఢిల్లీలో జెండా ఎగురవేసిన నరేంద్ర మోదీ


77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశం గురించి పలు అంశాలు ప్రస్తావించి దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని 10 కీలక పాయింట్లు చూద్దాం. మణిపూర్ సమస్యకు పరిష్కారం శాంతి మార్గం ద్వారా మాత్రమే కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ పరిష్కారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేసే త్యాగాలు రాబోయే వెయ్యేళ్లపై ప్రభావం చూపిస్తాయని ప్రధాని అన్నారు. భారత్ కొత్త విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం సహ అన్ని కలలను సాకారం చేసుకోగల సామర్థ్యం దేశానికి ఉందన్నారు. 


పరిమితులు, సాకులు లాంటివేవీ లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రధాని తెలిపారు. వృద్ధి, పురోగతి వల్ల భారతదేశంపై ప్రపంచ దేశాల అభిప్రాయం మారిందని అన్నారు. ప్రపంచం సాంకేతికత ఆధారితమైనదని, సాంకేతికతలో భారత్ తన ప్రతిభతో ప్రపంచ వేదికపై కొత్త పాత్రను పోషిస్తుందని, మరింత ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. అవినీతి, వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలు భారతదేశానికి ప్రధాన అడ్డంకులని అన్నారు ప్రధాని మోదీ. అచంచల విశ్వాసమే భారతదేశ అతిపెద్ద బలమని అన్నారు. భారత్ లో వరుసగా పేలుళ్లు జరిగే రోజులు పోయాయని స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ అన్నారు. నేడు దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని, నక్సల్స్ పీడిత ప్రాంతాల్లో కూడా భారీ మార్పు వచ్చినట్లు చెప్పారు.