Imd Alert On Heavy Temparatures: దేశంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఝార్ఖండ్ లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ తీరప్రాంతంలో, అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమబెంగాల్, బీహార్ లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని పేర్కొంది. అటు, తూర్పు మధ్యప్రదేశ్ లో రాత్రి వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. అయితే, ఇది ప్రమాదకరమని, శరీరం చల్లబడేందుకు అవకాశం తక్కువ ఉందని తెలిపింది. మొత్తంగా ఏప్రిల్ - జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు, ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమబెంగాల్ లోని గంగా పరివాహక ప్రాంతంలో ఈ నెల 17 నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప పగటి పూట బయటకు రావొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలని.. గొడుగు కానీ టోపీ కానీ ధరించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. 


Also Read: Kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం - అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా