Kashmir Terror Attack: భారత వాయుసేన అధినేత ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని తన లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఆదివారం నాడు ప్రధాని మోదీతో ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ భేటీ అయ్యారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ఈ భేటీ ప్రాదాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం నుంచి అమర్‌ప్రీత్ సింగ్ వెళ్లిపోతూ కనిపించారు.
ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. ఒక రోజు తర్వాత ఐఏఎఫ్ చీఫ్‌తో మోదీ నేడు సమావేశం అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం తర్వాత వీరు ఒక్కొక్కరుగా వెళ్లి భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, 3 సేవా అధినేతలు పాల్గొన్నారు.
త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కేంద్రం
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం బైసనర్ లోయలో ఉగ్రదాడి తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CSS) సమావేశం జరిగింది. CCSకు బ్రీఫింగ్‌లో పహల్గాం ఉగ్రదాడికి సరిహద్దు బయట సంబంధాలు బయటపడ్డాయి. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణిచివేయడానికి భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ లో ఆందోళన పెంచుతున్నాయి. ఉగ్రవాడులు ప్లాన్ ప్రకారం దాడి చేశారని నివేదికలు చెబుతున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడానికి భారత దేశ త్రివిధ దళాలకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. భారత బలగాలు దీనిపై నిర్ణయం తీసుకుని తమ ప్లాన్ ఆచరణలోకి తెస్తాయని ఇటీవల బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న.. వారికి ఆర్థిక సహకారం అందిస్తుందన్న పాకిస్తాన్ కు తమ ఉద్దేశాన్ని తెలిపేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఓడలు భారత ఓడరేవుల్లో నిలపకుండా నిషేధం విధించింది. పాక్ నుంచి భారత్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకండా కేంద్రం నిషేధించింది. పాక్ నుంచి భారత్ కు కార్గో సర్వీస్, ఎయిర్ సర్వీసెస్ సేవలను నిలిపివేశారు. సింధు జలాల ఒప్పందాన్ని కొన్ని రోజుల కిందట నిషేధించింది. పాక్ పౌరులకు భారత్ అన్ని రకాల వీసాలను రద్దు చేయడంతో పాటు వారిని తిరిగి పాక్ పంపించేసింది. వాఘా, అట్టారీ సరిహద్దును సైతం భారత్ మూసివేసి పాక్ పై ఉక్కుపాదం మోపుతోంది.
పాకిస్తాన్ రష్యా దౌత్యవేత్త ముహమ్మద్ ఖాలిద్ జమాలి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమపై భారత్ దాడికి పాల్పడితే మాత్నం.. భారతదేశంపై అణుబాంబు దాడి చేస్తామని హెచ్చరించారు.