Operation Brahma: మార్చి 28న మయన్మార్‌లో భయంకరమైన భూకంపం విధ్వంసం సృష్టించింది. ప్రకృతి సృష్టించిన విపత్తు నుంచి మయన్మార్‌ను కోలుకునేందుకు భారత్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో చేపట్టే సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది, నావికాదళ నౌకలను ఆదేశానికి పంపించింది. మానవతాదృక్పథంతో మయన్మార్ రాజధాని నేపిటావ్‌కు రెస్క్యూ బృందాన్ని పంపిన మొదటి దేశం భారతదేశం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శనివారం పేర్కొంది.
MEA ప్రకారం...జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బందిని తీసుకెళ్తున్న మొదటి భారత వైమానిక దళ C-130 విమానం నేపిటావ్‌లో ల్యాండ్ అయింది. భారత, మయన్మార్ రాయబారులు వాళ్లకు స్వాగతం పలికారు. "రాజధానిలో సహాయ సిబ్బందిని మొదటగా తీసుకువచ్చినది భారతదేశం. భూకంపం తర్వాత విమానాశ్రయం మూసివేశారు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ అయిన NDRF బృందం ఆదివారం తెల్లవారుజామున మండలేకు వెళ్తుంది. రెస్క్యూ కార్యకలాపాల కోసం మండలే చేరుకున్న మొదటి రెస్క్యూ బృందం భారత NDRF రెస్క్యూ బృందం అవుతుంది" అని MEA తెలిపింది.
38 మంది NDRF సిబ్బంది 10 టన్నుల సహాయ సామగ్రితో C-130 నేపిటాలో దిగింది. 60 పారా ఫీల్డ్ అంబులెన్స్‌లను మోసుకెళ్లే రెండు C17 విమానాలు త్వరలో దిగనున్నాయని MEA తెలిపింది.
ఘజియాబాద్‌లో ఉన్న 8వ NDRF బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ P K తివారీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ (USAR) బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ టీంలో 80 మంది NDRF సిబ్బంది, సెర్చ్-అండ్-రెస్క్యూ నిపుణులు, ఒక డాగ్ స్క్వాడ్ ఉంది.
NDRF డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) మొహ్సేన్ షాహెది మాట్లాడుతూ, "ప్రజలకు సహాయం అందేలా పని చేయడంలో రాబోయే 24-48 గంటలు చాలా కీలకం" అని అన్నారు.
‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద వైద్య సహాయం
ఆపరేషన్ బ్రహ్మ కింద భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ జగ్నీత్ గిల్ నేతృత్వంలోని ఎలైట్ శత్రుజీత్ బ్రిగేడ్ మెడికల్ రెస్పాండర్స్ నుంచి 118 మంది సభ్యుల వైద్య టాస్క్ ఫోర్స్‌ను పంపించారు. ఈ బృందం అవసరమైన వైద్య సామాగ్రితో చేరుకుంది. విపత్తు ప్రభావిత మండలాల్లో క్షతతగగాత్రులు, అత్యవసర శస్త్రచికిత్సలు ఇతర క్లిష్టమైన వైద్య సేవలు నిర్వహించడానికి 60 పడకల వైద్య చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మయన్మార్‌కు భారత్ రెండు నావికాదళ నౌకలను పంపిందని, మరో రెండు పంపించాల్సి ఉందని చెప్పారు. "HADR సిబ్బంది. సామగ్రిని విమానం ద్వారా పంపాం. 118 మంది సభ్యులతో కూడిన ఫీల్డ్ హాస్పిటల్ మరికొన్ని గంటల్లో ఆగ్రా నుంచి బయలుదేరుతుందని భావిస్తున్నా" అని ఆయన అన్నారు.
భారత నావికాదళ నౌకలు INS సత్పుర INS సావిత్రి 40 టన్నుల సామగ్రిని తీసుకువెళుతున్నాయని, యాంగోన్ నౌకాశ్రయానికి వెళ్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
టెంట్లు, దుప్పట్లు, అవసరమైన మందులు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, సోలార్ ల్యాంప్‌లు, ఆహార ప్యాకెట్లు, కిచెన్ సెట్‌లు వంటి 15 టన్నుల సహాయ సామగ్రిని మోసుకెళ్లే మొదటి విమానం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హిండన్ వైమానిక దళ స్థావరం నుంచి బయలుదేరింది. ఇది IST ఉదయం 8 గంటలకు యాంగోన్ చేరుకుంది, అక్కడ భారత రాయబారి యాంగోన్ కి సహాయ సామగ్రిని అందజేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడి భారతదేశం మద్దతు తెలిపారు. "మేము మయన్మార్ ప్రభుత్వానికి, ప్రజలకు మద్దతుగా నిలబడతాం. ఈ విపత్తును ఎదుర్కోవడానికి రక్షణ అవసరమైన సహాయం అందించడానికి మా వంతు కృషి చేస్తాము" అని మోడీ తెలియజేశారు.
మయన్మార్ భూకంపంలో 1,644 మంది మరణించారు
భూకంపం కారణంగా మయన్మార్‌లో కనీసం 1,644 మంది మరణించారు, ఇది పొరుగున ఉన్న థాయిలాండ్‌ను కూడా ప్రభావితం చేసింది. మయన్మార్‌లోని భారతీయ సమాజంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని MEA పేర్కొంది. "మా రాయబార కార్యాలయం చాలా యాక్టివ్‌గా ఉంది. భారతీయ సమాజ సంస్థలతో సంప్రదిస్తున్నారు. ఇప్పటివరకు, భారతీయ పౌరుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వారి సంక్షేమం, భద్రత కోసం మేము భారతీయ సమాజ సంస్థలతో సంప్రదిస్తున్నాము" అని జైస్వాల్ అన్నారు.