PM Modi Inaugurated Rapid Trains:
ర్యాపిడ్ ట్రైన్‌కి పచ్చ జెండా..
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ ట్రైన్‌ని ప్రారంభించారు. షహీదాబాద్-దుహాయ్ డిపోట్ మధ్య నడిచే రైలుకి పచ్చజెండా ఊపారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి Regional Rapid Transit System ఇదే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ ర్యాపిడ్ ట్రైన్స్‌ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రజలకు అభినందనలు తెలిపారు. భారత్ నిర్దేశించుకున్న కొత్త లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇదో మైలురాయి అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఇలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. తన బాల్యంలో ఎక్కువ సమయం రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే గడిపేవాడినని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
"భారత్ ప్రతి రంగంలోనూ దూసుకుపోతోంది. భారత్ చంద్రుడిపైనా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. G20 సమావేశాలతో ఖ్యాతి మరింత పెరిగింది. ఏషియన్ గేమ్స్‌లో 100కిపై మెడల్స్ సాధించగలిగాం. 5G నెట్‌వర్క్‌ని కూడా అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఈ క్రమంలోనే నమోభారత్‌నీ అందుబాటులోకి తీసుకొచ్చాం. నవ భారతానికి ఇదో ప్రతీక. పూర్తి దేశీయంగా తయారైన ఈ రైళ్లను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
అత్యాధునికమైన నమో భారత్ రైల్లో ప్రయాణించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అన్నారు ప్రధాని. ఇదే సమయంలో తన బాల్యాన్నీ గుర్తు చేసుకున్నారు. నవరాత్రి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
"అత్యాధునిక ట్రైన్ నమో భారత్‌లో ప్రయాణించాను. నాకు ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా బాల్యమంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే గడిపేవాడిని. ఇప్పుడిదే రైల్వే నాకు గొప్ప అనుభూతిని, ఆనందాన్నిస్తోంది. నవరాత్రి వేడుకల సమయంలో ఈ ట్రైన్‌ని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం. ఆ కాత్యాయిని దేవి ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది"
- ప్రధాని నరేంద్ర మోదీ