CM Sukhwinder Singh: చారాణా కోడికి, బారాణా మసాలా అనే సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనర్థం ఏమిటంటే.. అసలు సరకుకు అయ్యే ఖర్చు కంటే కొసరుకు ఎక్కువగా ఖర్చు చేయడమని అర్థం. మామూలుగా ఈ సామెతను తెలివి తక్కువ వారి గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ సామెత సరిగ్గా సరిపోయే ఒక వార్త ఇప్పుడు అటు సోషల్ మీడియాలో ఇటు మీడియా ఛానళ్లు, వెబ్ సైట్లలో ట్రెండ్ అవుతోంది. అసలేం జరిగిందంటే..


వైరల్ గా మారిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్ ప్రక్రియ


వాహనాలకు నంబరు ప్లేట్లు బిగించడం తెలిసిందే. స్కూటీ నుంచి ప్రతి వాహనానికి నంబరు ప్లేటు పెడతారు. ఈ నంబరును రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా శాఖ కేటాయిస్తుంది. రాష్ట్రం కోడ్ సీరియల్ నంబర్, జిల్లా కోడ్ సహా మరో నాలుగు నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లు ర్యాండమ్ గా కేటాయిస్తుంది రవాణా శాఖ. అయితే ఈ నంబర్లు ఫ్యాన్సీగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రతి రాష్ట్రంలోని రవాణా శాఖలు ఫ్యాన్సీ నంబర్లు ఇస్తాయి. వీటికి విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే వాటిని వెబ్ సైటులో పెట్టి బిడ్లు ఆహ్వానిస్తాయి రాష్ట్రాల రవాణా శాఖలు.


ఎవరికి నచ్చిన ఫ్యాన్సీ నంబరుకు వారికి నచ్చిన మొత్తంలో బిడ్ లు దాఖలు చేస్తుంటారు. ఎవరెంత ఎక్కువ కోట్ చేస్తే వారికే ఆ నంబరును కేటాయిస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహన ఖర్చులో కొంత మొత్తం, లేదంటే సగం మొత్తం, చాలా కొద్ది సందర్భాల్లో వాహన ఖర్చుతో సమానంగా బిడ్లు దాఖలు చేస్తుంటారు. ఇలాంటి ఫ్యాన్సీ నంబర్ బిడ్డింగ్ ప్రక్రియ హిమాచల్ ప్రదేశ్‌లోనూ జరిగింది. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. 


చారాణా కోడికి బారాణా మసాలా


ఒక వ్యక్తి ఫ్యాన్సీ నంబరు కోసం ఏకంగా అక్షరాల కోటీ 12 లక్షల 15 వేల 500 రూపాయలు బిడ్ వేశాడు ఓ వ్యక్తి. ఇంత భారీ మొత్తం పెట్టి ఫ్యాన్సీ నంబరు తీసుకుంటున్నాడు కదా.. ఏ ఫెరారీ కారో లేదంటే ఏ బెంజ్ కారో, రోల్స్ రాయిస్ కారో ఉందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కోటి 12 లక్షలు పెట్టి నంబరు ప్లేటు పెట్టాలనుకున్న ఆ వాహనం ఖరీదు కేవలం లక్ష రూపాయలు. అదో స్కూటీ. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి ఏకంగా కోటి 12 లక్షలకు పైగా వెచ్చించి బిడ్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


మరిన్ని బిడ్లు వస్తాయన్న అధికారులు


హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో హెచ్‌పీ 99-9999 అనే నంబరును రవాణా శాఖ తాజాగా వేలానికి పెట్టింది. దాని కోసం ఇప్పటి వరకు 26 మంది బిడ్ లు దాఖలు చేశారు. అందులో కోట్ ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.1,12,15,500 కు బిడ్ వేశాడు. అయితే ఆ ఫ్యాన్సీ నంబరు రిజర్వ్ ధరను అధికారులు కేవలం రూ.1000కే నిర్ధారించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లు కూడా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే వీఐపీ నంబర్ల బిడ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీతో బిడ్లు ముగియనున్నాయి. ఆలోపు ఎవరైతే అత్యధిక ధరకు బిడ్ వేస్తారో వారికే ఆ నంబరును అధికారులు కేటాయిస్తారు.