Bihar Politics : నితీష్‌ కుమార్‌ (Nitish Kumar) 20 ఏళ్లుగా బీహార్‌ (Bihar)ముఖ్యమంత్రి (Chief Minister) పీఠాన్ని వదలని రాజకీయ చాణుక్యుడు . ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో...అవసరాన్ని బట్టి గోడదూకడంలో నితీష్‌ ముందుటారు. ఎప్పుడు ఎవరికి హ్యాండిస్తాడో...ఎప్పుడు ఎవరితో కలుస్తాడో...రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేరు. తలపండిన రాజకీయ నేతలు, పండితులు కూడా నితీష్‌ కుమార్‌ వ్యూహాలను పసి గట్టలేరు. పదవి కోసం ఎంతకైన దిగజారుతాడు. రాజకీయ విలువలు గురించి అవసరం లేదు. సీఎం పదవి తర్వాతే ఏదైనా అంటాడు. సీట్లు ఎవరికి ఎక్కువున్నా సీఎం పదవి తనదే అంటారు నితీష్ కుమార్‌. 2013 నుంచి ఇప్పటికి నాలుగుసార్లు కూటముల మార్చేశారు నితీష్. ఎన్నిసార్లు కూటములు ఫిరాయించినా..20 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి.


జనతాదళ్‌తో పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ


మహాగడ్‌బంధన్‌కు రాంరాం చెప్పారు. నితీష్‌ కుమార్‌...యూటర్న్ తీసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఆయన కూటమిలు మార్చేశారు. మొదట్నుంచి నితీష్‌ రాజకీయ రూటే సపరేటు... జనతాదళ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నితీష్‌... ఆ పార్టీ తరపున 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆ పార్టీని చీల్చి సమతాపార్టీ పెట్టుకున్నారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన అటల్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2003లో తన పార్టీని జేడీయూలో విలినం చేసేసారు. ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది. 


2005లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు


2005లో బీజేపీతో చేతులు కలిపిన ఆయన ఘనవిజయం సాధించి తొలిసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2010లోనూ బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. కానీ 2013లో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంతో నితీష్‌ కమలంతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిపి మహాగడ్‌బంధన్‌ ఏర్పాటు చేశారు. అయితే 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సీఎంగా రాజీనామా చేసి మాంజీని ఆ పీఠంపై కూర్చోపెట్టారు. 2015లో మాంజీని దించేసి తాను మరోసారి సీఎం అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2017లో మహాగడ్‌బంధన్‌కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరిపోయారు. ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో...సీబీఐ లాలుప్రసాద్‌ ఇంట్లో సోదాలు చేయడంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమికి గుడ్‌ బై చెప్పారు. 2020లో తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో మళ్లీ బీజేపీని వదిలి మహాగడ్‌బంధన్‌ అంటూ కూటమిని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ కంటే జేడీయూకు తక్కువమంది ఎమ్మెల్యేలున్నా నితీషే సీఎం అయ్యారు. మళ్లీ రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. 


మోడీ హవాతోనే బీజేపీ చెంతకు


రకరకాల కారణాలతో కూటములు మార్చే నితీష్‌ ఈసారి బయటకు రావడానికి కారణం ఇండియా కూటమి ప్రధాన మంత్రి ఫేస్‌ కాలేకపోవడమే అంటున్నారు. ఇండియా కన్వీనర్‌గా ఖర్గేను ప్రకటించడంతో ఇక తనకు ఛాన్స్ రాదని నితీష్‌ డిసైడైనట్లు కనిపిస్తోంది. పైగా మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలు కూడా ఆయన్ను ఆలోచనలో పడేశాయి. ఉత్తరాదిలో ప్రధాని మోడీ హవా కొనసాగుతోంది. పైగా కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నతో బీహార్‌లో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మార్చేశారు మోడీ... దీంతో నితీష్‌కుమార్‌ జాగ్రత్తపడ్డారు. మోడీని ఢీ కొట్టలేని పరిస్థితులు, బలం లేకపోవడంతో బీజేపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు.