Housing Society Dress Code:
గ్రేటర్ నోయిడాలో..
గ్రేటర్ నోయిడాలోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఏరియాల్లో తిరిగేటప్పుడు కాస్త పద్ధతిగా డ్రెసింగ్ చేసుకోవాలని ఆదేశించింది. హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్‌లో ఈ రూల్ పెట్టారు. జూన్ 10వ తేదీన ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. చాలా మంది పార్కింగ్, కామన్ ఏరియాల్లో పురుషులు లుంగీలతో, మహిళలు నైటీలతో తిరుగుతుండటం సొసైటీ గమనించింది. ఇకపై ఇంకెప్పుడూ అలా కనిపించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ఈ సర్క్యులర్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అవడమే కాదు...పోలీసుల వరకూ వెళ్లింది వ్యవహారం. నెటిజన్లైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. "పర్సనల్ ఛాయిస్ ఉండదా" అని తిట్టి పోస్తున్నారు. డ్రెస్ కోడ్ పేరుతో విడుదల చేసిన ఆ సర్క్యులర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్క్యులర్‌లో ఏముంది..?
"ఈ సొసైటీలో మీరు ఎక్కడ తిరిగినా సరే మీ డ్రెసింగ్ ఎలా ఉందో ఓ సారి చూసుకోవడం మంచిది. మీ ప్రవర్తనతో పాటు డ్రెసింగ్ విషయంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కామన్ ఏరియాకి వచ్చినప్పుడు ఇంట్లో వేసుకునే లుంగీలు, నైటీలతో కనిపించడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోండి"
అందుకే ఈ నిర్ణయం..
అయితే దీనిపై విమర్శలు రావడం వల్ల సొసైటీ ప్రెసిడెంట్ స్పందించాల్సి వచ్చింది. ఇందులో తప్పేమీ లేదని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారాయన. మహిళలు నైటీలతో తిరిగితే పురుషులు ఇబ్బంది పడతారని, అలాగే పురుషులు లుంగీలతో తిరిగితే మహిళలీ ఇబ్బందికి గురవుతారని చెబుతున్నారు.
"సొసైటీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించాలి. ఇందులో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. మహిళలు నైటీలు వేసుకుని తిరిగితే పురుషులు కంఫర్ట్‌గా ఉండలేరు. అలాగే మహిళలు నైటీలతో తిరిగే పురుషులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పరస్పరం గౌరవించుకోవాలన్నదే మా ఉద్దేశం"
- సీకే కల్రా, సొసైటీ ప్రెసిడెంట్
అటు నెటిజన్లు మాత్రం "పాతకాలం మనుషుల్లా ఏంటిది" అని ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ వేర్‌ని కూడా బ్యాన్ చేస్తారా అంటూ మరి కొందరు మండి పడుతున్నారు. ఏ సొసైటీలోనూ ఇలాంటి రూల్స్ చూడలేదని స్థానికులు మండి పడుతున్నారు. ఇలాంటి రూల్స్ పెట్టే ముందుకు ఆలోచించరా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: మీటింగ్‌కి షర్ట్ లేకుండా వచ్చి షాక్ ఇచ్చిన ఆఫీసర్, సస్పెండ్ చేసిన అధికారులు