Pakistan Occupied Kashmir: 


పీఓకే మనదే: అమిత్ షా 


కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై కీలక ప్రకటన చేశారు. అది ముమ్మాటికీ భారత్‌దేనని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పారు. 70 ఏళ్లుగా హక్కులు కోల్పోయిన వారికి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్పటి ప్రధాని నెహ్రూ తప్పు చేయకపోయుంటే..ఇప్పుడు ఈ POK సమస్య ఉండేదే కాదని విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో 24 నియోజకవర్గాలను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-Occupied Kashmir)కే రిజర్వ్ చేసినట్టు స్పష్టం చేశారు. Jammu and Kashmir Reorganisation Bill ని ప్రవేశపెడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్‌ షా. జమ్ములో గతంలో 37 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..ఇప్పుడు ఆ సంఖ్యని 43కి పెంచుతున్నట్టు వెల్లడించారు. కశ్మీర్‌లో గతంలో 46 స్థానాలుండగా ఆ సంఖ్య ఇప్పుడు 47కి పెరిగింది. కశ్మీరీ పండిట్‌లు చెల్లాచెదురైపోయారని, సొంత దేశంలోనే శరణార్థులుగా జీవించాల్సి వచ్చిందని మండి పడ్డారు. వాళ్లందరికీ హక్కులు ఇచ్చేందుకే ఈ బిల్‌ని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. 


"కశ్మీరీ పండిట్‌లు అక్కడ భారీగా వలస వెళ్లిపోయారు. సొంత దేశంలోనే శరణార్థులుగా బతకాల్సి వచ్చింది. 46,631 కుటుంబాలు వలస వెళ్లాయి. వాళ్లందరికీ హక్కులిచ్చేందుకే ఈ బిల్ తీసుకొచ్చాం. ఈ బిల్‌ వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది"


- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి






ఇదే సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూపైనా తీవ్ర విమర్శలు చేశారు అమిత్‌ షా. ఆయన చేసిన తప్పుల వల్లే కశ్మీర్‌ ఇన్నేళ్లుగా సమస్యలు ఎదుర్కొందని అసహనం వ్యక్తం చేశారు.


"మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే రెండు తప్పుల వల్ల కశ్మీర్‌ ఇన్నేళ్లుగా సమస్యలు ఎదుర్కొంది. మన ఆర్మీ సరిగ్గా గెలిచే సమయంలో కాల్పుల విరమణ ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు కాల్పులు జరిగి ఉంటే POK మన భూభాగంలోనే ఉండేది. ఇక రెండో తప్పు. మన అంతర్గత సమస్యని ఐక్యరాజ్య సమితి వరకూ తీసుకెళ్లడం. ఈ రెండు తప్పులే కశ్మీర్‌ని ఇలా చేశాయి"


- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి