భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఓ ఉగ్రవాది అంత్యక్రియల్లో కనిపించాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, భారత్‌కు వ్యతిరేకంగా ప్రాక్సీగా వాడుకునే పాక్ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఇది మరోసారి రుజువు చేస్తోందని భారత్ వ్యాఖ్యానించింది.


ఈ ఉగ్రవాదులను పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులుగా పరిగణించదని, అందుకే వారంతా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడింది భారత్‌. భారత్‌పై విషం చిమ్మండి... ఎన్నికల్లో పోటీ చేయండి అనే విధానంలో పాక్‌ తీరు ఉందని ధ్వజమెత్తింది. 


ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)కు భారత్ విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి పాకిస్థాన్ 'టెర్రర్ సపోర్టింగ్ నేషన్' అని భారత్ పేర్కొంది. ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ నుంచి బయటపడేందుకే ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ నటిస్తోంది. ఎఫ్ఏటీఎఫ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఈ విషయాన్ని గుర్తించాలి అని భారత్‌ సూచించింది. 


రావల్పిండిలో కనిపించిన సయ్యద్ సలావుద్దీన్
ఇటీవల పాకిస్థాన్‌లోని రావల్పిండి నగరంలో కనిపించాడు సలావుద్దీన్. భారత్‌కు చెందిన మరో వాంటెడ్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ ఇటీవల పాకిస్థాన్ లో హతమయ్యాడు. ఆయన మరణానంతరం రావల్పిండిలో ఒక కార్యక్రమం జరిగింది. బషీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేశారు. అందులో సయ్యద్ సలావుద్దీన్ కూడా కనిపిస్తున్నాడు.


సయ్యద్ సలావుద్దీన్ ఎవరు?
సయ్యద్ సలావుద్దీన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధిపతి. ఈ సంస్థ భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ లో అనేక ప్రధాన ఉగ్రవాద దాడులకు పాల్పడింది. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నడీ సలావుద్దీన్. సయ్యద్ సలావుద్దీన్ ను అమెరికా కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించడం సంచలనంగా మారుతోంది.