Gyanvapi ASI Survey: జ్ఞానవాపి వివాదంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇచ్చిన రిపోర్టు గురువారం (జనవరి 25) విడుదలైంది. ప్రస్తుతం ఉన్న మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా ఏఎస్ఐ అధికారులు గుర్తించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చింది. ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించారు. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించారు. జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నట్లుగా కూడా పురావస్తు నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.


ఈ రిపోర్టును ఏఎస్ఐ అధికారులు ఈ కేసులో ఇరు పక్షాలకు కాపీలను అందించారు. హిందూ తరపు న్యాయవాది విష్ణు జైన్ ఏఎస్ఐ నివేదికలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఏఎస్‌ఐ రిపోర్టులో ఉన్న అంశాలన్నీ డాక్యుమెంట్‌గా ఉన్నాయని తెలిపారు. కట్టడాలకు ఎలాంటి హాని జరగకుండా నిపుణులు సైంటిఫిక్ సర్వే చేశారని వివరించారు.


ఆ రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. కారిడార్ పక్కనే ఓ బావి కనిపించిందని విష్ణు జైన్ చెప్పారు. ఇక్కడ కనిపించే పూర్వ నిర్మాణం చాలా పెద్ద హిందూ దేవాలయం అని అన్నారు. ఏఎస్‌ఐ జీపీఆర్‌ సర్వే ప్రకారం హిందూ దేవాలయంలోని స్తంభాలపై నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఒక గొప్ప హిందూ దేవాలయం ఉండేదని చెప్పవచ్చు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. మసీదు కంటే ముందు హిందూ దేవాలయం ఉందని అన్నారు.


స్తంభాలను మసీదు కోసం


‘‘పర్షియన్ భాషలో రాసిన శాసనాలతో ఓ రాయిని గుర్తించారు. దానిపై ఔరంగజేబు ఆజ్ఞ రాసి ఉంది. అందులో ఆలయాన్ని కూల్చివేయమని రాసి ఉంది. ఈ రాయి విరిగిపోయింది. దీన్ని ఒక గదిలో గుర్తించారు. దానిపై మసీదు నిర్మాణ తేదీ కూడా రాసి ఉంది. నివేదిక ప్రకారం.. ఇప్పటికే ఉన్న మసీదులో భాగమైన స్తంభాలు పాతదైన పెద్ద ఆలయంలో భాగం. కొన్ని చిన్న మార్పుల తర్వాత మసీదు కోసం దీనిని ఉపయోగించారు’’ అని విష్ణుజైన్ చెప్పారు. నేలమాళిగలో మునుపటి స్తంభాలను మసీదు కోసం ఉపయోగించారు. మసీదు పడమటి గోడ కూడా హిందూ దేవాలయంలో ఒక భాగం అని అన్నారు. 


ఈ సర్వేపై ముస్లింల తరపు న్యాయవాది ఎక్లాఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. సర్వే నివేదిక చదివిన తర్వాతే తాను ఏదైనా మాట్లాడతానని చెప్పారు.