Republic Day Celebrations in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేస్తున్నారు. దేశ రాజధానిలోని కర్తవ్య పథ్ తోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీపేంద్ర పాఠక్‌ భద్రతకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కర్తవ్య మార్గ్‌లోని ప్రధాన ప్రాంతంలో 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 


పోలీసు పహారాలో ఢిల్లీ


గణతంత్ర దిన వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు పహారాలో ఉండనుంది. కమాండోలు, క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లు, పీసీఆర్‌ వ్యాన్‌లు, మోర్పాలు, యాంటీ డెమోలిషన్‌ డిటెక్షన్‌ టీమ్స్‌, స్పాట్‌ టీమ్‌లు విధి నిర్వహణతోపాటు ఢిల్లీలోని సున్నితమైన ప్రదేశాల్లో మోహరించనున్నారు. ఢిల్లీలోన సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసి వేయనున్నారు. భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించనున్నట్టు దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు. 


28 జోన్లుగా విభజన


గణతంత్ర దినోత్సవ వేడుకలు నేపథ్యంలో భద్రతా పరమైన ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీని 28 జోన్లుగా విభజించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ జోన్లలో పోలీసు ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఇక హెల్ప్‌ డెస్కులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సమయానికి అతిథులు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. చెక్‌ పాయింట్ల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. రిపబ్లిక్‌ డే వేడుకలను రప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.