YS Sharmila meets Undavalli Aruna Kumar: కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌ ను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. రాజమండ్రిలోని ఉండవల్లి నివాసంలోనే వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఉండవల్లిని కుటుంబ సాన్నిహిత్యం వల్లనే కలిశానని అన్నారు. తన ఇరు కుటుంబాలకు ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు. వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లని తాను కలుస్తున్నానని చెప్పారు.


‘‘ఉండవల్లి అరుణ కుమార్ కుటుంబ సభ్యులకు మా కుటుంబ సభ్యులకు సాన్నిహిత్యం ఉంది. ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను’’ అని షర్మి అన్నారు. అనంతరం  ఉండవల్లి అరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘‘షర్మిళ నేను రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు,  ప్రత్యేక హోదా అంశాలు ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేసాయి. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయి. షర్మిలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.


షర్మిలతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలికలు కనబడుతున్నాయి. రాజకీయాల పరంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకోకూడదు. గతంలో ఎన్టీఆర్ కుమార్తె పురందరరేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కుటుంబ కలహాలు అందరికీ ఉండేవే. రాజకీయాల్లో ఎవరిదారుల్లో వారు నడుస్తుంటారు. కాంగ్రెస్ లో వైఎస్ రాజరేఖరరెడ్డితో నాకు మంచి అనుబంధం ఉండేది. దివంగత రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అంటే నాకు అభిమానం. షర్మల తనను ఆశీర్వదించమంది, ఆశీర్వదించాను. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నా’’ అని ఉండవల్లి అన్నారు.