IND vs ENG 1st Test: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు... భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.... తర్వాత బ్యాటర్లు సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. దీంతో తొలిరోజును భారత్ సంతృప్తిగా ముగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో.. 246 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. 24 పరుగుల వద్ద రోహిత్ వెనుదిరిగాడు. తొలి ఓవర్ నుంచి ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్ 70 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సులతో 76 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. బ్రిటీష్ బౌలర్లపై ఆది నుంచి ఎదురుదాడికి దిగిన జైస్వాల్ విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. యశస్వీకి తోడుగా 14 పరుగులతో గిల్ క్రీజులో ఉన్నాడు.
స్పిన్నర్ల మాయాజాలం
ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో స్టోక్స్ సేన తొలి 11 ఓవర్లకు 53 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అశ్విన్ , జడేజా, అక్షర్ బౌలింగ్ కుతోడు.... ఫీల్డర్లు అద్భుత క్యాచ్ లు అందుకోవడంతో 246 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 155 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బ్రిటీష్ జట్టును...... స్టోక్స్ ఆదుకున్నాడు. 88 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు, బుమ్రా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్- రోహిత్ భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
చరిత్ర సృష్టించిన అశ్విన్
హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. తొలి టెస్టులో బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న మూడో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.
మరో రికార్డు
ఈ మ్యాచ్‌లో అశ్విన్- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ 501 వికెట్లు తీయగా.. వీరిద్దరూ ఆ రికార్డును బద్దలు కొట్టారు.
జో రూట్ అరుదైన రికార్డు
హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగి 2, 555 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉండగా... సరిగ్గా 2,555 పరుగులు చేసి జో రూట్ కూడా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ ఇంకొక్క పరుగు చేస్తే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా రూట్ చరిత్ర సృష్టిస్తాడు. కానీ జడేజా బౌలింగ్‌లో రూట్ (29) ఔటయ్యాడు.