Hindi Controversy: పార్లమెంటులో హిందీలో బిల్లులు ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు అధికార డీఎంకే విమర్శలు గుప్పించింది. ఈ చర్య హిందీని బలవంతంగా రుద్దడమేనని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మూడు బిల్లులను హిందీలో ప్రవేశపెట్టడం అంటే దేశవ్యాప్తంగా బలవంతంగా హిందీని తీసుకువచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఎంకీ ఎంపీ విల్సన్ ఆరోపించారు. మూడు బిల్లుల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరారు. హిందీని తప్పనిసరిగా అమలు చేయవద్దని, హిందీని బలంవంతంగా రుద్దడం  రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. 


పార్లమెంట్ సమావేశాలకు హాజరైన తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఎంపీ విల్సన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు బిల్లులను హిందీలో ప్రవేశ పెట్టడం వల్ల ప్రజలకు ఏ బిల్లు గురించి అర్థం కావడం లేదని, హిందీలోని పేర్లను ఉచ్ఛరించడం కష్టమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో దేశం అంతటా హిందీని బలవంతంగా ప్రవేశపెట్టడానికి దారి తీస్తుందని డీఎంకే ఎంపీ విల్సన్ అన్నారు. ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మూడు బిల్లుల టైటిల్స్ హిందీలో ఉన్నాయని, చట్టాల శీర్షికలు హిందీలో ఉండటం రాజ్యాంగ అధికరణానికి విరుద్ధంగా అభివర్ణించారు. బిల్లులతో సహా ఏది దాఖలు చేసినా తప్పనిసరిగా ఇంగ్లీష్ లోనే ఉండాలని రాజ్యాంగంలో చెప్పబడినట్లు ఎంపీ విల్సన్ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్ 2023, భారతీయ సాక్ష్యా బిల్లు 2023 బిల్లును ప్రవేశపెట్టారు. 


Also Read: PM Modi: బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై మోదీ మండిపాటు, రక్తంతో ఆడుకున్నారంటూ మమత సర్కారుపై ధ్వజం


ఇటీవల ఢిల్లీలో జరిగిన అధికార భాష పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశానికి అధ్యక్షతన వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషకు ఆమోదం తక్కువగా ఉన్నా.. అందరూ వ్యతిరేకత లేకుండా అంగీకరించాలని అమిత్ షా కోరారు. హిందీ అనేది ఇతర భాషలకు ఏమాత్రం పోటీ కాదని.. అన్ని భారతీయ భాషల్ని ప్రోత్సహిస్తేనే దేశం సాధికారత దిశగా పయనిస్తుందని అమిత షా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. హిందీ భాషకు అంగీకారం కోసం అమిత్ షా చేస్తున్న ఒత్తిడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. ఇదంతా హిందీయేతరులను లొంగదీసుకునే ప్రయత్నంగా అమిత్ షా అభివర్ణించారు. హిందీ ఆధిపత్యాన్ని, ప్రయోగాన్ని తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని అన్నారు స్టాలిన్. హిందీకి బానిసలుగా ఉండబోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడంపై వస్తున్న వ్యతిరేకతను కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తుంచుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.