Hindenburg Case Hearing:



సుప్రీంకోర్టులో విచారణ..


హిండెన్‌బర్గ్ కేసు (Hindenburg Report) విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసిన ఈ రిపోర్ట్‌పై పలు ప్రశ్నలు వేసింది. విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లను నమ్మడమెలా అని ప్రశ్నించింది. తాము ఈ రిపోర్ట్‌ని కొట్టిపారేయడం లేదని, ఆధారాలుంటే కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. George Soros ఇచ్చిన ఈ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అదానీ గ్రూప్‌లో అక్రమమార్గంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని ఈ రిపోర్ట్ ఆరోపించింది. జార్జ్ సోరోస్ స్థాపించిన Organised Crime and Corruption Reporting Project (OCCRP) ఈ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇద్దరు ఫారిన్ ఇన్వెస్టర్‌ల చేతుల్లోనే ఇదంతా జరిగిందని చెప్పింది. ఈ ఆరోపణల్ని Adani Group కొట్టిపారేసింది. హిండన్‌బర్గ్ రిపోర్ట్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఈ అంశంపై తమ వాదన వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు. సెబీ కూడా ఈ రిపోర్ట్‌ని ఖండించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని మండి పడింది. మొత్తానికి ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 


"విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో ఉన్నదంతా నిజమే అని ఎలా నమ్మగలం. అయినా మేం ఆ రిపోర్ట్‌ని కొట్టిపారేయడం లేదు. మాకు ఆధారాలు కావాలి. అదానీ గ్రూప్‌ తప్పు చేసిందనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో చూపించండి"


- సుప్రీంకోర్టు 




సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అసహనం వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలు ఇచ్చిన ఇలాంటి రిపోర్ట్‌లపైన విచారణ చేపట్టాలని చెప్పడం సరికాదని అన్నారు. భారత్ విధానాలపై విదేశీ సంస్థలు ఇలా విమర్శలు చేయడం ఓ ట్రెండ్ అయిపోయిందని మండి పడ్డారు. సెబీ తరపున వాదించిన తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.