Himachal Pradesh Floods:


హిమాచల్‌లో భారీ వర్షాలు..


హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ఏడాది వానలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. ఈ వరదలు సృష్టించిన బీభత్సం నుంచి బయటపడాలంటే కనీసం ఇంకో ఏడాది పట్టేలా ఉంది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి. కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. మొత్తంగా ఈ వరదలు, కొండ చరియలు విరిగిపడడం లాంటి కారణాలతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ 81 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చికుక్కున్న వాళ్లను బయటకు తీస్తున్నారు. కొంత మంది ప్రాణాలు కాపాడుతున్నా...కొందరిని రక్షించలేకపోతున్నారు. మరి కొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొద్ది రోజుల పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. ఒక్క హిమాచల్‌లోనే ఇప్పటికే ప్రాణనష్టం తీవ్రంగా వాటిల్లింది. దాదాపు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజుల్లోనే 71 మంది చనిపోగా..13 మంది అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకూ 57 మంది మృతదేహాలను గుర్తించారు. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. షిమ్లాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ చెప్పిన వివరాల ప్రకారం...జూన్ 24న హిమాచల్‌లో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ 214 మంది ప్రాణాలు కోల్పోయారు. 38 మంది కనిపించకుండా పోయారు. సమ్మర్ హిల్, కృష్ణా నగర్‌ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 






సహాయక చర్యలు..


గత 24 గంటల్లో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 1,731 మందిని సురక్షితంగా తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్లతో పాటు ఆర్మీ సిబ్బంది, NDRF సహాయక చర్యలు చేపడుతున్నారు. 54 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో 742 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా...ఇక్కడ 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ సారి ఆ రికార్డు అధిగమించింది. ఈ జులైలో 50 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టి వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ఓ రిసార్ట్‌లో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పౌరి కోట్‌ద్వార్ దుగ్గాడ నేషనల్ హైవే బ్లాక్ అయింది. రిషికేశ్ బద్రినాథ్ హైవే కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా పంజాబ్‌లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్‌లో డ్యామ్‌లు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు.