Bilaspur Landslide: మంగళవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఝండుత అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్తిన్ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక ప్రయాణీకుల బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయంది. దీంతో పెద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, 18 మంది అక్కడికక్కడే మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఒక చిన్నారిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. బిలాస్‌పూర్ జిల్లాలోని భల్లు వంతెన సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాలు, బండరాళ్లు అకస్మాత్తుగా 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టాయి.

Continues below advertisement

రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి

అధికారులు వచ్చేలోపు స్థానికులు వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు, శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని బయటకు తీశారు. బిలాస్‌పూర్ జిల్లాలోని ఘుమార్విన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఝండుతా ఆసుపత్రికి చికిత్స కోసం గాయపడిన వారిని తరలించారు. అధికారులు, విపత్తు ప్రతిస్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను సమన్వయం చేశాయి. ఈ ప్రాంతంలో నిరంతరం కురుస్తున్న వర్షాలకు కొండ వాలు బలహీనపడిందని అందుకే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.  

హిమాచల్ ముఖ్యమంత్రి విచారం 

ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని, సాధ్యమైన సహాయాల చేస్తుందని హామీ ఇచ్చిందని అన్నారు.

Continues below advertisement

"ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంది. సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుంది" అని ముఖ్యమంత్రి సుఖు అన్నారు. సహాయ, రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని, గాయపడిన వారందరికీ తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సిమ్లా నుంచి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం 

ప్రధాని కార్యాలయం ఈ ప్రమాదంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. పోస్ట్‌లో ప్రధాని మోదీ ఇలా పోస్టు చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ అని అన్నారు.

‘ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తాం.’ అని అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాదంపై సంతాపం తెలిపారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాదాన్ని "చాలా విషాదకరం" అని అభివర్ణించారు. "హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో కొండచరియలు విరిగిపడి జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది మరణించిన వార్త చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా "హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో కొండచరియలు విరిగిపడిన బస్సు ప్రమాదం పట్ల నేను చాలా బాధపడ్డాను. NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని రాశారు.