Heavy Rains In Maharashtra:
మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. కొద్ది గంటలుగా ముంబయి, నాగ్‌పుర్ సహా మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబయి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
రికార్డ్ స్థాయిలో
మంగళవారం ఉదయానికే ముంబయి నగరంలో సగటున 95.81 మిమీ వర్షపాతం నమోదైంది. భారీవర్షాల వల్ల మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో భారీ వరదలు వెల్లువెత్తే అవకాశాలుండటంతో తీరప్రాంత కొంకణ్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రెండు బృందాలను మోహరించారు. ఠాణె, పుణె, రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హెచ్చరిక
ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకే జనాలు అల్లాడిపోతుంటే రానున్న కొద్ది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముంబయి నగరంతో పాటు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
సీఎం సమీక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే.. వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.
Also Read: Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!