Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం తుపాన్ (michaung Cyclone) ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. గత 24 గంటల్లో 20 నుంచి 29 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై 5 నుంచి 6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీ వానలతో జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి. దాదాపు 70కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన అధికారులు, మరో 33 సర్వీసులను దారి మళ్లించారు. కాంచీపురం (Kanchipuram), తిరువళ్లూరు (Tiruvallur), చెంగల్పట్టు (Chengalpattu) జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో చెన్నైలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, అధికార యంత్రాగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం స్టాలిన్ అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుపాను కారణంగా ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు. 






 










 






















తెరిపిచ్చిన వర్షం


కాగా, మంగళవారం ఉదయానికి వర్షం కాస్త తెరిపినివ్వడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును మూసేయగా, మంగళవారం ఉదయం సిబ్బంది రన్ వేపై నీటిని తొలగించారు. విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. నగరంలో కొన్ని చోట్ల వరద ఉద్ధృతితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూవమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తమిళనాడులో తుపాను కారణంగా వర్షాల వల్ల 8 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు, ఏపీ, ఒడిశాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. 


Also Read: Cyclone Michaung News: రవాణా వ్యవస్థపై మిగ్‌జాం ఎఫెక్ట్‌- విమానాలు, రైళ్లు రద్దు