న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాననష్టం సంభవించడంపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం హృదయ విదారకకం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి ముర్ము, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హాథ్రస్ జిల్లాలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం బాధాకరం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం నాడు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు.
రాహుల్ గాంధీ విచారం..
హాథ్రస్ తొక్కిసలాట విషాదంపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన భక్తులు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని’ యూపీ ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం
యూపీలోని హాథ్రస్‌లో జరిగిన విషాదంపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని.. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలన్నారు.
బెంగాల్ సీఎం మమతా సంతాపం
భక్తులు పెద్ద సంఖ్యలో మరణించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.