Hathras stampede Telugu News: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రతీభాన్‌పూర్‌లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పందించింది. ఈ విషాద ఘటనపై విచారణకు ఆదేశించింది. తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. 


ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లా సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామం (రతీభాన్‌పూర్‌లో)లో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. భోలే బాబా సత్సంగం జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. కార్యక్రమంలో ఒక్కసారిగా తోపులాట జరిగి అది తొక్కిసలాటగా మారింది. ఈ ఘటనలో దాదాపు 87 మంది మృతి చెందడంతో విషాదం నెలకొంది. చనిపోయిన వారిలో అధికంగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. తొక్కిసలాట గురించి సమాచారం అందగానే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఇటా హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ఇటాలోని మెడికల్ ఆసుపత్రికి తరలించారు.