Kamal Gupta On POK: రానున్న రెండు మూడేళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ - POK భారతదేశంలో భాగం అవుతుందని హర్యానా మంత్రి, భారతీయ జనతా పార్టీ(BJP) సీనియర్ నాయకుడు, డాక్టర్ కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. హర్యానాలోని రోహ్ తక్ లో వ్యాపార ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీవోకే భారత్ లో భాగం అవుతుందని ధీమాగా చెప్పారు.
2014 లో తాము బలంగా లేము అని, కానీ ఇప్పుడు దృఢంగా తయారయ్యామని కమల్ గుప్తా అన్నారు. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందన్న కమల్ గుప్తా.. అక్కడి ప్రజలు భారత్ లో కలిసేందుకు ఇష్టంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో పీవోకే భారత్ లో భాగమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలోనే అది జరుగుతుందని కమల్ గుప్తా జోస్యం చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశామని కమల్ అన్నారు. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేస్తున్నాయని, ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయని హర్యానా కేబినెట్ మంత్రి తెలిపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేశాం: కమల్ గుప్తా
'2014 కు ముందు మనం బలంగా లేము. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారయ్యాం. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. భారత్ లో చేరాలని అక్కడి నుండి చాలా మంది కోరుతున్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో ఏ క్షణంలో అయినా పీవోకే భారత దేశంలో భాగం అవుతుంది. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేవడంతో పాటు ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడి ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారు.' అని కమల్ గుప్తా వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు..
భారత్ పొరుగు దేసం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందని కమల్ గుప్తా తెలిపారు. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా జనజీవనం హరంగా మారిందని కమల్ గుప్తా పేర్కొన్నారు. ఇంతలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ ను వీడి భారత్ లో చేరాలని కోరుకుంటున్నారని హర్యానా మంత్రి తెలిపారు. గత నెలలోనే పీవోకే నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ లో చేరాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో జే సింద్ ముత్తాహిదా మహాజ్- JSMM అధ్యక్షుడు షఫీ బర్ఫత్ కూడా ఫిబ్రవరి 14న పాకిస్థాన్ తన దేశం కాదని మరోసారి అన్నట్లు గుర్తు చేశారు.